calender_icon.png 21 October, 2024 | 7:00 AM

భళారే!

20-10-2024 12:21:09 AM

ద్విపాత్రాభినయం అంటే ప్రేక్షకులకు కన్నుల పండగే. అలాంటిది ఒకే హీరో నాలుగైదు పాత్ర ల్లో కనిపిస్తే అభిమానులకు మహాదానందమే. ద్విపాత్రాభినయం, మల్టీ గెటప్స్‌తో సినిమాలు తెరకెక్కడం కొత్తేం కాకపోయినా, ఇటీవల వరుసగా విడుదలైన చిత్రాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని చ్చాయి. 

ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం 

ఎన్టీఆర్ కథానాయకుడిగా ఇటీవల విడుదలై, విశేషంగా ప్రేక్షకాదరణ పొందిన చిత్రం ‘దేవర’. ఈ సినిమాలో ఇద్దరు ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంతో ఆకట్టుకున్నారు. సముద్రంపై ఆధిపత్యం కోసం జరిగే పోరు నేపథ్యంలో సాగే కథలో తండ్రీకొడుకుల పాత్రల్ని ఎన్టీఆర్ చేశారు. పార్ట్ దేవర పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో తన కొడుకు వర పాత్ర అంతకు మిం చేలా రెండో భాగంలో ఉంటుందని చిత్రబృందం చెప్తోంది.  

ఏక బిగిన ఐదు పాత్రల్లో శ్రీవిష్ణు.. 

‘శ్వాగ్’ సినిమాలో శ్రీవిష్ణు ఏకంగా అయిదు పాత్రల్లో కనిపించారు. ఓకే వంశంలో తాత, కొడు కు, మనవడు అన్ని పాత్రలను విష్ణు పోషించారు. భవభూతి మహారాజుగా, జూనియర్ భవభూతి (ఎస్సై) గా, యయాతిగా, యువకుడు సింగరేణిగా, ట్రాన్స్‌జెండర్ అనుభూతిగా నటించారు. అయితే శ్రీవిష్ణు అన్నింటిలోకెల్లా ట్రాన్స్‌జెండర్ పాత్రకు ప్రాణం పోసినట్టు అనిపిస్తుంది. ఈ ఐదు పాత్రల్లో ప్రేక్షకులకు ఎక్కువగా గుర్తుండిపోయే పాత్ర ‘అనుభూతి’. ఈ పాత్రలో శ్రీవిష్ణు కొంత వైవిధ్యమైన మేనరిజంతో కమల్‌హాసన్ అనుకరణతో కొత్తగా అనిపించారు. ఇక యువకుడిగా సింగరేణిగా, మహారాజుగా కూడా నటన బాగుంది.  

రీతు వర్మ డ్యూయల్ రోల్.. 

అందం, ప్రతిభ గల అతి తక్కువ మంది తెలుగు హీరోయిన్లలో ఒకరైన రీతు వర్మ ఇటీవల విడుదలైన ‘శ్వాగ్’తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమాలో ద్విపాత్రాభినయంతో మెప్పించింది. పురుషాధిక్యాన్ని వ్యతిరేకించే వింజామర వంశ మహారాణి రుక్మిణీదేవిగా, అన్యాయాన్ని ఎదిరించే సివిల్ ఇంజినీర్ అనుభూతిగా నటించింది. ఈ క్యారెక్టర్లను సవాలుగా తీసుకుని నటించిన రీతుకు ప్రశంసలు దక్కాయి.  

రెండు పాత్రల్లో కనిపించనున్న ప్రభాస్ 

ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సుమారు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు దర్శకుడు సందీప్ ఇప్పటికే స్పష్టం చేశాడు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నాడనేది తాజాగా వినిపిస్తున్న టాక్. ఇప్పటికే బాహుబలిలో తండ్రీకొడుకుల గెటప్‌లో నటించాడు. కానీ అక్కడ ఆ రెండు క్యారెక్టర్స్ ఒకేసారి ఎదురుపడవు. స్పిరిట్‌లో మాత్రం ప్రభాస్ రెండు పాత్రల్నీ ఒకేసారి తెరమీద చూపించనున్నారట. ఇందుకోసం దర్శకుడు.. ప్రభాస్‌ను ఏ విధంగా మేకోవర్ చేసి చూపిస్తాడో తెలుసుకునేందుకు మరో రెండేళ్లయినా పడుతుంది.  

మూడు పాత్రల్లో సూర్య! 

హీరో సూర్య నటించిన చిత్రం ‘కంగువ’ నవంబర్ 14న విడుదల కానుంది. ఒక చారిత్రాత్మక నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ గతం, వర్తమానం, భవిష్యత్‌తో ప్రారంభమవు తుందని ఇప్పటివరకూ రివీల్ చేసిన కంటెంట్ ఆధారంగా అర్థమవుతోంది. ఇందులో సూర్య మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం సూర్య ఏకంగా తన లుక్‌ని మార్చుకున్నట్టు సమాచారం. మూడు పాత్రలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయంటున్నారు. ఇప్పటికే మేకర్స్ సూర్యకు సంబంధించి రెండు లుక్‌లను విడుదల చేశారు. అందులో ఒకటి.. కత్తి పట్టిన యుద్ధ వీరుడిలా ఉండగా, మరొక లుక్‌లో మోడరన్ వారియర్‌గా ఎదురెదురుగా కనిపించారు.