calender_icon.png 28 September, 2024 | 12:59 AM

భళా.. మాస్టర్ మైండ్స్

24-09-2024 12:00:00 AM

  1. చెస్ ఒలింపియాడ్‌లో భారత్ ఘన విజయం 
  2. ఇరగదీసిన తెలంగాణ చిన్నోడు 
  3.  రెండు విభాగాల్లో స్వర్ణం ఇదే తొలిసారి

చదరంగం మనకు పుట్టినిల్లు లాంటిది. దేశం నుంచి ఎందరో గ్రాండ్‌మాస్టర్లు అంతర్జాతీయ వేదికపై చాలాసార్లు సత్తా చాటారు. ఎన్నో టైటిళ్లు సాధించినప్పటికీ చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణం మాత్రం కలగా మిగిలిపోయింది.  కానీ ఆదివారంతో ఆ ముచ్చట తీరిపోయింది. ఒకటి కాదు ఏకంగా రెండు విభాగాల్లో (పురుషుల, మహిళలు) స్వర్ణం కొల్లగొట్టి భారత చెస్ క్రీడాకారులు కొత్త చరిత్ర సృష్టించారు. అందుకే మన మాస్టర్ మైండ్స్‌ను భళా అనకుండా ఉండలేం. ఈ విజయాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు గ్రాండ్‌మాస్టర్లు కీలక పాత్ర పోషించడం గమనార్హం..!

విజయక్రాంతి, ఖేల్ విభాగం :

ప్రతిష్ఠాత్మక 45వ చెస్ ఒలింపియాడ్‌లో భారత్ చాంపియన్‌గా నిలిచింది. అటు పురుషులు.. ఇటు మహిళల విభాగంలో మన చదరంగం మేధావులు అగ్రస్థానంలో నిలిచి తొలిసారి స్వర్ణం కొల్లగొట్టి ఔరా అనిపించారు. 193 దేశాలు పోటీ పడిన మెగా ఈవెంట్‌లో భారత్ టాప్‌లో నిలిచి ట్రోఫీని కొల్లగొట్టడం  మాములు విషయం కాదు. ఎందరో భారత గ్రాండ్‌మాస్టర్లకు సాధ్యం కానీ ఫీట్‌ను పురుషుల బృందం (అర్జున్, ప్రజ్ఞానంద, హరిక్రిష్ణ, గుకేశ్, విదిత్ గుజరాతీ).. మహిళల బృందం (ద్రోణవల్లి హారిక, తానియా, వంతిక, వైశాలీ, దివ్య) సాధించింది. ఇప్పటిదాకా చెస్ ఒలింపియాడ్‌లో మనకు మూడు కాంస్యాలు వచ్చాయి. 2014, 2022లో పురుషుల బృందం కాంస్యం సాధించగా.. 2022లో భారత మహిళల బృందం కూడా కాంస్యంతో మెరిసింది. 2022లో 44వ చెస్ ఒలింపియాడ్ చెన్నై వేదికగా జరిగిన సంగతి తెలిసిందే.

అర్జున్ అదరహో..

చెస్ ఒలింపియాడ్‌లో భారత చారిత్రక ప్రదర్శన వెనుక తెలుగు రాష్ట్రాల గ్రాండ్‌మాస్టర్లు కీలకపాత్ర పోషించారు. తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి ఆడిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ ఒలింపియాడ్‌లో ఒక్క గేమ్ కూడా ఓడిపోని ఏకైక ప్లేయర్‌గా అర్జున్ రికార్డులకెక్కాడు. ఆడిన 11 మ్యాచ్‌ల్లో 9 విజయాలు సాధించాడంటేనే చెస్ బోర్డుపై ఎంత ఆధిపత్యం ప్రదర్శించాడో అర్థమవుతోంది. భారత్‌కు స్వర్ణం దక్కడంలో అర్జున్ చివరి రెండు రౌండ్లలో అర్జున్ విజయాలు సాధించడం చాలా ఉపయోగపడింది. ఇక 38 ఏళ్ల పెంటేల హరిక్రిష్ణ తన అనుభవంతో కుర్రాళ్లకు మార్గనిర్దేశం చేశాడు. ఆడింది మూడు గేములే అయినప్పటికీ.. రెండు విజయాలు, ఒక డ్రాతో కీలకపాత్ర పోషించాడు.

ఇక మహిళల విభాగంలో ద్రోణవల్లి హారిక తన ప్రత్యేకతను చాటుకుంది. టోర్నీలో హారిక 9 గేములాడినప్పటికీ మూడింటిలో విజయం సాధించింది. అయితే కీలక సమయాల్లో ఒత్తిడిని దాటి విజయాలు సాధించడంతో అనుభవం ముందు ఎవరైనా తలవంచాల్సిందేనని నిరూపించింది. పురుషుల విభాగంలో గుకేశ్, ప్రజ్ఞానంద..అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌పై కన్నేసిన గుకేశ్ దొమ్మరాజు 10 మ్యాచ్‌ల్లో 8 విజయాలు..

రెండు డ్రాలు సాధించడం విశేషం. మరో గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద ఆడిన 10 గేముల్లో కఠిన ప్రత్యర్థులనే ఎదుర్కొన్నప్పటికీ మూడు విజయాలు, ఆరు డ్రాలు నమోదు చేసుకున్నాడు. మహిళల విభాగంలో యువ తేజాలు దివ్య దేశ్‌ముఖ్, ఆర్. వైశాలీ కూడా అదరగొట్టారు. ముఖ్యంగా దివ్య 11 గేముల్లో 8 విజయాలు సాధించడం విశేషం. ఇక వంతిక అగర్వాల్ మధ్యలో నాలుగు వరుస విజయాలు సాధించి భారత్ టాప్‌లో నిలవడంలో ముఖ్యపాత్ర పోషించింది.