నిర్మల్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ఆడెల్లి పోచమ్మ గంగానీళ్ల జాతర ఆదివారం ఘనంగా నిర్వహించారు. శని, ఆదివారాల్లో రెండు రోజుల జాతరలో భాగంగా రెండవ రోజు ఆదివారం అమ్మవారి నగలకు దిలువార్ మండలం స్వాంగ్వీ వద్ద గోదావరి వద్ద పుణ్యస్నానాలు చేయించారు. పోలీసుల భారీ బందోబస్తు నడుమ అడెల్లికి ఊరేగింపుగా తరలించారు.
సాంగ్వీ, మల్లపూర్, బన్సపల్లి, దిలువార్‌పూర్, మడెగాం, వంజర్, ప్యారమూర్, బోరిగాం సారంగపూర్, అడెల్లి గ్రామాల మీదుగా ఆలయానికి కాలినడకన తీసుకెళ్లారు. అమ్మవారి నగలకు ఆయా గ్రామల్లో మత్స్యకార్మికులు చేపల వలలతో రక్షణగా ఏర్పడి డప్పు వాయిద్యాల మధ్య నృత్యాలు చేశారు.
భక్తులు 40 కిలో మీటర్లు అమ్మవారి నగలతో నడిచేందుకు పోటీపడ్డారు. అమ్మవారి నిలయం అయిన అడెల్లి బాల మందిరంలో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.