22-04-2025 10:20:18 PM
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ లో గల భాగ్యరధి జూనియర్ కళాశాల విద్యార్థులు ఇటీవలి ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో తమ ప్రతిభను చాటారు. వివిధ గ్రూపులలో పలు రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకులు సాధించడమే కాకుండా, అత్యుత్తమ మార్కులతో కళాశాల గౌరవాన్ని పెంచారు. సీనియర్ బైపీసీ గ్రూపులో చదువుతున్న ఆప్షన్ జేబీన్ 996/1000 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించింది. ఎంపీసీ గ్రూపులో ఎల్.రవీన 990/1000 మార్కులతో, సీఈసీ గ్రూపులో షాహిమా 983/1000 మార్కులతో, ఎంఈసీ గ్రూపులో బి.నందిని కూడా 983/1000 మార్కులతో రాష్ట్రస్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించారు.
జూనియర్ ఇంటర్మీడియట్ లోనూ సానియా బేగం (ఎంఈసీ గ్రూపు) 495/500 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. బైపీసీ గ్రూపులో ఎండి.అవేజ్ 435/440 మార్కులు, ఎంపీసీ గ్రూపులో ఎల్.అంజలి 463/470 మార్కులు, సీఈసీ గ్రూపులో ఎస్.అనూష 480/500 మార్కులు సాధించి కళాశాల ప్రతిష్ఠను మరింత పెంచారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన విద్యార్థులకు ద్వితీయ సంవత్సరానికి పూర్తి ట్యూషన్ ఫీజును మాఫీ చేస్తున్నామని తెలిపారు. భాగ్యరధి కళాశాల తక్కువ ఫీజుతో అత్యున్నత ఫలితాలు అందించడంలో ముందుందని అన్నారు. ఈ ఏడాది రెండు రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకులు సాధించడం గర్వకారణమని సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయోత్సవ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు సిహెచ్.గోవిందరెడ్డి, కె.రామకృష్ణ, జి.రమేష్ బాబు, నల్ల జై శంకర్ గౌడ్ పాల్గొన్నారు.