calender_icon.png 7 November, 2024 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భాగ్యనగరి దుఃఖిస్తున్నది!

07-11-2024 01:35:04 AM

  1. నేను మూసీని 

  2. హైదరాబాద్ మురికి కూపాన్ని!

  3. నాడు హైదరాబాద్‌కు నేను ‘జల’హారాన్ని.. నలుగురిని పచ్చగా బతికించిన ఖ్యాతి నాది. పచ్చదనాన్ని మొలకలు వేయించిన చరిత నాది. కానీ, ఇప్పుడు నేను మురికి కూపాన్ని.. పరిశ్రమలు విసర్జించే వ్యర్థాలను కలుపుకొనే వాహినిని.. ఆక్రమణల కీకారణ్యాన్ని.. భాగ్యనగరం గుండెలపై జడలు విప్పుకొన్న కాలుష్య భూతాన్ని.. మొత్తంగా నేను విషాద గీతాన్ని! కొత్తగా నిర్మించిన జలాశయాలు, నందనవనాలు, రబ్బరు డ్యాంలు, నాలాలేవీ నా దుఃఖాన్ని ఆపలేకపోయాయి. కన్నీటిని తుడవలేకపోయాయి.

  4. హైదరాబాద్‌కు ‘జల’హారం మూసీ.. 
  5. నగరవాసుల దాహార్తి తీర్చిన వర దాయిని
  6. పారిశ్రామికవాడల నుంచి రసాయనిక వ్యర్థాలు 
  7. జలాశయాలు, రబ్బర్ డ్యాంలు నిర్మించినా ఫలితం శూన్యం 

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 6 (విజయక్రాంతి): భాగ్యనగర వికాసానికి సజీవ సాక్ష్యం.. నగరవాసుల దాహార్తి తీర్చిన జల ప్రదాయిని మూసీ. ‘అనంత’గిరులు దిగివచ్చి.. కోనలు దాటి.. గండిపేట చేరుకుని.. అక్కడి నుంచి పరుగులు పెడుతూ నది మహానగరంలోకి అడుగుపెడుతుంది.

వస్తూ వస్తూనే మూసా, ఈసా నదులను కలుపుకొని మూసీగా మారుతుంది. 1948 ఫిబ్రవరి 12న ఈ సంగమంలో గాంధేయవాదులు మహాత్మా గాంధీ అస్తికలు కలిపారు. అందుకు స్మారకంగా నాటి ప్రభుత్వం 68 ఎకరాల్లో బాపుఘాట్ నిర్మించింది. ఘాట్ వద్ద మూసా ప్రవాహం వేగం తగ్గించేందుకు నాటి ప్రభుత్వం ప్రహరీ నిర్మించింది.

అలా వరద ఉధృతికి అడ్డుకట్ట వేసినట్లయింది. తర్వాత స్థానికంగా ఏం జరిగింతో తెలియదు గానీ ఘాట్‌ను అనుకుని శ్మశాన వాటిక వెలిసింది. దీని పక్కనే ఉన్న నదీ పరీవాహకం ఆక్రమణలకు గురైంది. వాటిన్నింటనీ దాటుకుని మూసీ అత్తాపూర్, పురానాపూల్, చాదర్‌ఘాట్, అంబర్‌పేట, నాగోల్ మీదుగా ప్రవహిస్తుంది.

పైప్‌లైన్ వ్యవస్థతో..

1908 వరదల తర్వాత నిజాం ప్రభుత్వం హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నిర్మించింది. నగర పరిధిలో వరద నీరు పారేందుకు పెద్ద పైప్‌లైన్ సైతం వేయించింది. 1980లో వరద నీటి పైప్‌లైన్‌కు డ్రైనేజీ వ్యవస్థను కలపడంతో నదీ జలాలు కలుషితం కావడం ప్రారంభమైంది.

అలాగే నగరంలోని పారిశ్రామిక ప్రాంతాల నుంచి విడుదలయ్యే రసాయనిక పదార్థాలు, ఆవాసాల నుంచి నాలాల ద్వారా వచ్చే మురుగు నదిలో చేరి మరింత కలుషితమైంది. ప్రధానంగా ఉస్మానియా దవాఖాన మార్చురీ ప్రాంతం నుంచి, చాదర్ ఘాట్ బ్రిడ్జి, అంబర్‌పేట, నాగోల్ తదితర ప్రాంతాల్లో నదిలో మురుగు ఎక్కువగా కలుస్తున్నది. 

కొట్టుకుపోయిన రాతికాలువ.. 

మూసీని కాలుష్యం కోరల నుంచి కాపాడేందుకు 1997 నాటి రాష్ట్ర ప్రభుత్వం నది సుందరీకరణకు ‘నందనవనం’ పేరుతో ప్రాజెక్ట్ ప్రారంభించింది. మూసీలో  రాతితో ప్రహరీ నిర్మించింది. మిగతా ప్రాంతాన్ని కొంతమేర సుందరీకరణ చేసింది. ఒకటి రెండు చోట్ల వాకింగ్ ట్రాక్‌లుఏర్పాటు చేసింది. 2000లో కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చి ప్రహరీ కొట్టుకుపోయింది. ఫలితంగా ఆ ప్రాజెక్టును సర్కార్ నిలిపివేసింది. 

పనిచేయని రబ్బరు డ్యామ్‌లు.. 

రాతిప్రహరీ కొట్టుకుపోయిన తర్వాత కొన్నాళ్లు మూసీ గురించి ఎవరికీ పట్టింపు లేకపోయింది. తిరిగి 2004 లో నాటిప్రభుత్వం మూసీ పరిధిలో ప్రయోగాన్ని చేపట్టింది. నాడు సర్కార్ రూ.390 కోట్ల నిధులతో రెండు రబ్బరు డ్యాంలు నిర్మించింది. వరదలు సంభవించినప్పుడు ఆ డ్యాంలు వ్యాకోచించి వరదను నియంత్రిస్తాయని, వరదలు వెళ్లిన తర్వాత తిరిగి అవి యథాస్థానంలోకి వస్తాయని అంచనా.

కానీ, మూసీలో వరద ఉధృతి ధాటికి రబ్బరు డ్యాంలు పనిచేయలేదు. దీంతో రూ.వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరైంది. తెలంగాణ వచ్చిన తర్వాత నాటి ప్రభుత్వం మరో ప్రయత్నం షురూ చేసింది. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్‌డీసీఎల్)ను ఏర్పాటు చేసింది.

నది పరీవాహక ప్రాంతాల్లో వాకింగ్ ట్రాక్, ఓపె న్ ట్రాక్, సుందరీకరణకు రూ.1,500 కోట్లు కేటాయించింది. అయితే.. అనుకున్న లక్ష్యాలేవీ పూర్తి కాలేదు. పరిస్థితి మళ్లీ ఎక్క డ వేసిన గొంగడి అన్న చందంగానే మారింది. 

జలం.. కాలకూట విషం

  1. నాలాలు, పరిశ్రమల నుంచి మూసీలోకి మురుగు
  2. నది పరిధిలో ప్రమాదకరస్థాయిలో కాలుష్యం
  3. తీవ్ర అనారోగ్యాన్ని కలిగించే రసాయనిక అవశేషాలు
  4. కాలుష్యంతో వేర్వేరు చోట్ల వేర్వేరు రంగుల్లో నీరు
  5. ప్రపంచంలోని ప్రమాదకర నదుల్లో మూసీది 22వ స్థానం

హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంత్రి): మూసీ నది కాలుష్యానికి మారుపేరుగా మారింది. మూసీ పేరు చెప్తేనే మురుగు గుర్తువచ్చే పరిస్థితి. మూసీ వైపు ముక్కుపుటాలు అదురుతాయని అందరికీ తెలిసిన విషయమే. జీడిమెట్ల, బాలానగర్ నుంచి వచ్చే రసాయనిక వ్యర్థాలు లోయర్ ట్యాంక్‌బండ్ గోశాల వద్ద హుస్సే న్ సాగర్ నాలాలో కలుస్తాయి.

ఈ పైప్‌లైన్ ఉన్న రోడ్డు పదేళ్ల క్రితం కుంగిపోవడంతో రసాయనిక వ్యర్థాలను మూసీలో కలిపేందుకు ప్రత్యేక పైప్‌లైన్ ఏర్పాటైంది. అప్పటి వరకూ ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా పారిన రసాయనిక వ్యర్థాలు నేరుగా హుస్సేన్ సాగర్‌లోకి చేరుతున్నాయి. కొన్నిసార్లు బల్దియా సిబ్బంది డ్రమ్ముల్లో రసాయనిక వ్యర్థాలను నింపి నాగోల్‌లోని మూసీలోకి వదులుతుండగా గతంలో సామాజిక కార్యకర్తలు పట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.

అలా ‘మూసీ బచావో’ ఆందోళనలు సైతం ప్రారంభమయ్యాయి. నగరంలో ప్రతి రోజూ 1,650 మిలియన్ లీటర్ల మురుగు నీరు విడుదలవుతుండగా, దానిలో 25 ఎస్టీపీల ద్వారా కేవలం 772 మిలియన్ లీటర్ల మురుగు మాత్రమే శుద్ధి అవుతున్నది. మిగతా 878 మిలియన్ లీటర్ల మురుగు మూసీలోకే విడుదలవుతున్నది. 

కాలుష్యంతో రంగులు మార్పు..

వాస్తవానికి జలం ఏ రంగును కలిగి ఉండదు. కానీ మూసీలో పారే జలాలు మాత్రం కలుషితమయ్యే శాతాన్ని బట్టి వివిధ రంగులు మారుతున్నదని 2020లో సామాజిక కార్యకర్త సంజీవ్ చేసిన పరిశోధనలో తెలింది. హిమాయత్ సాగర్, ఫీర్జాదీగూడలో స్వచ్ఛంగా ఉన్న జలాలు లంగర్ హౌజ్ వద్ద బూడిద రంగు, సిటీ కళాశాల వద్ద నలుపుగు రంగులోకి మారినట్లు వెల్లడైంది.

అలాగే హిమాయత్ సాగర్, పీర్జాదీగూడలో నది నుంచి ఎలాంటి వాసన రాకుండగా, లంగర్‌హౌజ్, సిటీ కళాశాల, నాగోల్ వద్ద దుర్గంధం వెదజల్లుతుంది. ఒక లీటర్ నీటిలో 20 మి.గ్రా ఉండాల్సిన కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (సీవోడీ) నాగోల్ వద్ద 68.4 మిల్లీ గ్రాములు, సిటీ కాలేజీ వద్ద 28.9 మిల్లీ గ్రాములు ఉన్నట్టు తేలింది.

లీటర్ నీటిలో 1 మిల్లీ గ్రాము కంటే తక్కువగా ఉండాల్సిన బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ నాగోల్ వద్ద 32.4 మిల్లీ గ్రాములు, సిటీ కాలేజీ వద్ద 22 మిల్లీ గ్రాములు ఉన్నట్టు వెల్లడైంది. దీన్నిబట్టి నది కాలుష్యాన్ని అంచనా వేయవచ్చు.

48 రకాల రసాయనిక అవశేషాలు..

మూసీ నీటిలో మొత్తం 48 రకాల రసాయనిక అవశేషాలు ఉన్నాయని శాస్త్రీయ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వీటిలో ఆర్సినిక్, క్రోమియం, కాపర్, లెడ్ తదితర రసాయనాలు ఉన్నాయి. వీటి ద్వారా మానవాళికి క్యాన్సర్, కిడ్నీ, చర్మ, కీళ్లనొప్పుల వంటి జబ్బులు వస్తాయి. 

‘స్విస్’ సర్వే ఏం చెబుతుందంటే..

స్విస్ అనే అంతర్జాతీయ సంస్థ కొన్నేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నదులపై అధ్యయనం చేపట్టింది. మొత్తం 140 దేశాల పరిధిలోని 258 నదుల్లో కాలుష్యంపై సర్వే చేసింది. ఈ సర్వేలో ప్రపంచంలో అత్యంత కాలుష్యమైన నదుల్లో మూసీ నది 22వ స్థానంలో ఉందని తేల్చింది. ఈ నీరు తాగితే ప్రజలు రోగాల బారిన పడతారని తేల్చింది.