- రణరంగంగా ప్రజాభిప్రాయ సేకరణ
- ‘ఫార్మాసిటీ’పై రైతుల కన్నెర్ర
- కలెక్టర్ ప్రతీక్‌తో పాటు అధికారులు, పోలీసులపై భౌతికదాడులు
- భయంతో పొలాల్లోకి పరుగులు తీసిన అధికారులు
- వెంబడించి కర్రలతో దాడి చేసిన గ్రామస్థులు
- అధికారుల వాహనాలు సైతం ధ్వంసం
- గ్రామంలో పోలీసుల మోహరింపు
- వీడియోల ఆధారంగా 50 మంది అరెస్ట్
వికారాబాద్, నవంబర్ 11 (విజయక్రాం తి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గం ఉద్రిక్తతలతో అట్టుడుకింది. ఫార్మా పరిశ్రమ ఏర్పాటుపై దుద్యాల మండలంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేందుకు వెళ్లిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్, కడా ప్రత్యేకాధికారి వెంకటరెడ్డికి ప్రతిఘటన ఎదురైంది. ఫార్మా పరిశ్రమను వ్యతిరేకిస్తున్న రైతులు సోమవారం లగచర్ల శివారులో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణను గ్రామానికి చెందిన రైతులు బాయ్‌కాట్ చేశారు.
దీంతో వారికి నచ్చజెప్పేందుకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్‌జైన్, ప్రత్యేకాధికారి వెంకటరెడ్డితో పాటు ఇతర అధికారులపై పోలీసులు చూస్తుండగానే గ్రామస్తులు భౌతికదాడులకు పాల్పడ్డా రు. అధికారులకు సంబంధించిన కార్లను ధ్వంసం చేశారు. దీంతో లగచర్ల రణరంగం గా మారింది. పోలీసులు అతి కష్టంమీద అధికారులను దాడుల నుంచి సురక్షితంగా కాపాడి అక్కడి నుంచి తరలించారు.
వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి భారీగా పోలీసు బలగాలను మోహరింపజేసి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. తెలిపిన వివరాల ప్రకారం.. దుద్యాల మండల పరిధిలో ని పోలెపల్లి, లగచర్ల, హకీంపేట్, నోకటిబండ తాండ, పుల్చుర్లకుంట తండా పరిధి లో 1,358.37 ఎకరాల్లో ఫార్మా సిటీ ఏర్పా టు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.
అందుకు గాను 90 ఎకరాల ప్రభుత్వ భూమి, పరిశ్రమల యాజమాన్యాలకు 721 ఎకరాలు, అసైన్డ్ భూములు 547 ఎకరాలు సేకరించాలని నిశ్చయించి ఈమేరకు చర్య లు ప్రారంభించింది. ఈ ప్రతిపాదనలను ఆయా గ్రామాలకు చెందిన రైతులు వ్యతిరేకి స్తూ వస్తున్నారు. ఫార్మాసిటీతో తాము భూములు కోల్పోవడమే కాకుండా, ఆ ప్రాంతమంతా కాలుష్యం బారిన పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే అనేకసార్లు రాస్తారోకోలు, నిరవధిక దీక్షలు చేపట్టారు. ఎట్టిపరిస్థితుల్లోనూ భూమి అప్పగించేది లేదని ప్రకటించారు. కానీ, ప్రభు త్వం మాత్రం ఫార్మాసిటీ ఏర్పాటుపై పట్టుదలగా ఉంది. దీనిలో భాగంగానే ఆయా గ్రామాల పరిధిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని కలెక్టర్ నిర్ణయించారు.
పోలీసు బలగాలు లేకుండానే..
ఫార్మాసిటీ వ్యవహారం ఆరు నెలలుగా రగులుతున్న వివాదం. రైతులు ఇప్పటికే అనేకసార్లు దీక్షలు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు సైతం వారికి మద్దతు తెలిపాయి. గత నెలలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఆందోళన కారులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిని సైతం నిర్బంధించారు. పరిస్థితులు ఇంత సున్నితంగా ఉన్నాయని తెలిసినప్పటికీ పోలీస్‌శాఖ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉద్రిక్తత ఇలా..
లగచర్ల శివారులో సోమవారం హకీంపేట్, లగచర్ల రైతులతో నిర్వహించతలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణకు కలెక్టర్ ప్రతీక్ జైన్, కడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి, అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, మూడు మండలాల తహసీల్దార్లు హాజరయ్యారు. ఈ క్రమంలో కొందరు గ్రామస్తులు అక్కడి వచ్చి ప్రజాభిప్రాయ సేకరణ గ్రామ శివారు లో కాకుండా, గ్రామంలో నిర్వహించాలని కలెక్టర్‌ను డిమాండ్ చేశారు.
అందు కు కలెక్టర్ అంగీకరించి ఇతర అధికారులతో కలిసి గ్రామంలోకి వెళ్లారు. అధి కారుల వాహనాలు ఊర్లోకి ప్రవేశిస్తుండగానే గ్రామస్తులు ‘కలెక్టర్ డౌన్ డౌన్.. కలెక్టర్ గో బ్యాక్’ నినాదాలు ప్రారంభించారు. కలెక్టర్ కారు దిగి ఆందోళనకా రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, గ్రామస్తులు వినలేదు. దీంతో తోపులాట జరిగింది. అది కాస్తా ఉద్రిక్త త మారింది. కలెక్టర్‌పై ఓ మహిళ దాడికి పాల్పడింది.
పలువురు గ్రామస్తులు కర్రలతో అధికారులపై దాడులు చేశారు. ముగ్గురు తహసీల్దార్లను వెంబడించి మరీ దాడికి పాల్పడ్డారు. అధికారుల వాహనాలపై రాళ్లు విసిరారు. దీంతో వాహన అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో కలెక్టర్ వ్యక్తిగత సిబ్బంది, పోలీసులు అప్రమత్తమై ఆయన్ను కారు ఎక్కించి అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు. మరోవైపు దాడిలో ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి సైతం గాయపడ్డా రు.
తాము భూములు ఇచ్చేది లేదని అనేకసార్లు ఆయనకు వినతిపత్రాలు ఇచ్చినా ఎందుకు పట్టించుకోలేదని ఆయన్ను నిలదీశారు. ఆయన అక్కడి నుంచి పొలాల్లోకి వెళ్లి పరుగులు తీస్తు న్నా గ్రామస్తులు వెంబడించారు. ఎట్టకేలకు ఆయన ఓ వాహనంలో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయి కొడంగల్‌కు చేరుకున్నారు. గ్రామస్తుల దాడిలో డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డితో పాటు పోలీస్ సిబ్బందికీ స్వల్పగాయాలయ్యాయి.
పోలీస్ నిఘాలో గ్రామం
ఉద్రిక్తతలు సద్దుమణిగిన తర్వాత పోలీస్‌శాఖ లగచర్ల గ్రామాన్ని తన పహారాలోకి తీసుకున్నది. 300 మంది పోలీస్ సిబ్బందిని మోహరింపజేసింది. గ్రామంలోకి కొత్తగా ఎవరినీ అనుమతించడం లేదు. సోషల్‌మీడియాతో పాటు మీడి యాలో ప్రసారమైన వీడియోల ఆధారంగా పోలీసులు అరెస్ట్‌లు ప్రారంభించి నట్లు తెలిసింది.
రాత్రి వరకు సుమారు 50 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కలెక్టర్‌తో పాటు అధికారులపై దాడులను కాంగ్రెస్ పార్టీ నాయకు లు ఖండించారు. సాయంత్రం కొడంగల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అధికారులపై దాడులకు పాల్పడిన నిందితులను గుర్తించి.. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.