calender_icon.png 15 October, 2024 | 3:52 PM

భగ్గుమన్న బంగారం

18-08-2024 12:00:00 AM

రూ.72,000 దాటేసిన ధర

తులం మరో రూ.1,150 ప్రియం

ప్రపంచ మార్కెట్లో కొత్త రికార్డు

హైదరాబాద్, ఆగస్టు 17: శ్రావణ మాసం ప్రారంభంలోనే నాలుగు రోజుల క్రితం రూ.1,000కుపైగా పెరిగిన బంగారం ధర మరింత ఎగిసిపోయింది. శనివారం ఒక్క రోజులోనే తులం బంగారం ధర రూ.1,100పైగా పెరిగి రూ.72,000 స్థాయిని అధిగమించింది.  హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం తులం ధర  రూ. 1,150 పెరిగి రూ.72,770  వద్దకు చేరింది. మూడు వారాల క్రితం బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో రూ.68,000 స్థాయికి దిగిన పుత్తడి తిరిగి అప్పటి నుంచి రూ.4,000 మేర పెరిగింది. ప్రత్యేకించి ఐదు రోజుల్లోనే రూ.2,200 వరకూ అధికమయ్యింది. హైదరాబాద్‌లో తాజాగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,050 మేర పెరిగి రూ.66,700వద్దకు చేరింది.

ఇదే బాటలో వెండి ధర సైతం కేజీ ధర రూ.2,000 పెరిగి రూ.91,000 స్థాయిని అందుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో శుక్రవారం రాత్రి ఔన్సు బంగారం ధర 2,548 డాలర్లకు చేరి కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ నేపథ్యంలో దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో 10 గ్రాముల ధర రూ.1,300 వరకూ పెరిగి  రూ.71,400 స్థాయికి చేరింది. ప్రపంచ మార్కెట్లో నెలకొన్న బుల్లిష్ ట్రెండ్ కారణంగా స్థానికంగా వెండి, బంగారాల ధరలు పెరుగుతున్నాయని బులియన్ వర్తకులు తెలిపారు. యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఈ సెప్టెంబర్‌లో వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు, మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ మార్కెట్లో అదేపనిగా బంగారం పెరుగుతున్నది.