calender_icon.png 24 October, 2024 | 4:52 PM

భగ్గుమన్న దౌత్యయుద్ధం

16-10-2024 12:00:00 AM

భారత్, కెనడాల మధ్య దౌత్యయుద్ధం మరోసారి భగ్గుమంది. ఖలిస్థానీవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో కెనడాలోని భారత ఉన్నతస్థాయి దౌత్యవేత్తలు ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని  జస్టిన్ ట్రూడో మరోసారి ఆరోపించడంతో  ఇరుదేశాలమధ్య మళ్లీ దౌత్యయుద్ధం మొదలైంది. నిజానికి నిజ్జర్ హత్య విషయంపై ఇరు దేశాల మధ్య దౌత్యవివాదం గత ఏడాదే మొదలైంది.

ఢిల్లీలో జి20 సదస్సుకు హాజరైన ట్రూడో ఆ తర్వాత కొద్ది రోజులకే నిజ్జర్ హత్య ఉదంతాన్ని లేవనె త్తారు. నిజ్జర్ హత్యలో భారత ఏజంట్ల పాత్ర ఉందంటూ ఆయన చేసిన ఆరోపణలను అప్పట్లోనే భారత్ తీవ్రంగా ఖండించింది. ట్రూడో నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది. కొద్ది రోజుల పాటు ఇరుదేశాల మధ్య దౌత్య వివాదం కొనసాగిన తర్వాత కాస్త చల్లారింది.

2023 జులై 18న బ్రిటీష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా వెలుపల నిజ్జర్‌ను దుండగులు కాల్చి చంపారు. ఈ హత్యకు సంబంధించి భారత్‌కు చెందిన ముగ్గురు నిందితులను కెనడా పోలీసులు అరెస్టు చేశారు.  ఈ ముగ్గురు నిందితులకు పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలున్నాయని భారత్ అనుమానిస్తోంది.

అయితే ఈ హత్యతో తమ దేశంలోని భారత హైకమిషనర్ సంజయ్ సింగ్ వర్మ సహా పలువురు దౌత్య అధికారులకు సంబంధాలున్నాయని కెనడా ఆరోపిస్తోంది. ఈ అధికారులను పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్( అనుమానితులు)గా కెనడా ప్రభుత్వం తాజాగా ప్రకటించడంతో మరోసారి ఇరు దేశాల మధ్య వివాదం మొదలైంది.

ఈ ఆరో పణలను తీవ్రంగా ఖండించిన భారత్ కెనడాలోని తమ హైకమిషనర్ సహా ఇతర దౌత్య సిబ్బందిని వెనక్కి రప్పించాలని నిర్ణయించింది. అలాగే భారత్‌లోని ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను  ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రిలోగా దేశాన్ని వదిలి వెళ్లాలని ఆదేశించింది.

అంతకు ముందు కెనడా దౌత్యవేత్తను పిలిపించిన భారత విదేశాంగ శాఖ ఎలాంటి ఆధారాలు లేకుండా భారత దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకోవడం ఎంతమాత్రం ఆమోదం కాదని స్పష్టం చేసింది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు ట్రూడో ప్రభుత్వం ఇస్తున్న మద్దతుకు ప్రతిస్పందనగా తగు చర్యలు తీసుకునే అధికారం తమకు ఉందని పేర్కొంది.

అయినా ట్రూడోతో పాటుగా కెనడా మంత్రులంతా ఇంకా పాత పాటే పాడుతున్నారు. తగిన ఆధారాలతోనే తాము మాట్లాడుతున్నామంటున్నారు. రాయల్ కెనడియన్ మౌంటె డ్ పోలీసులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే భారత దౌత్యవేత్తలను బహిష్కరించామని ఆ దేశ విదేశాంగమంత్రి చేసిన ప్రకటన మరింత రెచ్చగొట్టే లా ఉంది తప్ప సమస్య పరిష్కారానికి తోడ్పడేలా లేదు.

అంతేకాదు భారత్‌పై ఆంక్షలకు కూడా సిద్ధమవుతున్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. భారత్‌ఆసియాన్ శిఖరాగ్ర సదస్సుకోసం ఇటీవల లావోస్ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ కెనడా ప్రధాని ట్రూడోతో సమావేశమయ్యారు. కానీ ఆ సమావేశంలో ఇరుదేశాల మధ్య సంబంధాలపై ఎలాంటి చర్చ జరగలేదని కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఆ సమావేశం జరిగిన కొద్ది రోజులకే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. వచ్చే ఏడాది కెనడాలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రజల్లో పలుకుబడి కోల్పోయిన ట్రూడో నేతృత్వంలో ఎన్నికలకు వెళితే ఓటమి ఖాయ మని అధికార పార్టీ భయపడుతోంది.

దీంతో దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న సిక్కు ఓటర్ల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో భాగంగానే ట్రూడో ఈ ఆరోపణలు చేస్తున్నట్లు భారత రాజకీయ పరిశీలకులు అనుమానిస్తున్నారు. ఈ వివాదం ఎలా ఉన్నప్పటికీ కెనడాలో పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయ విద్యార్థులపై ఈ వివాదం ప్రభావం ఎలా ఉంటుందనే విషయమై ఆందోళన నెలకొంది.

కెనడాలోని అంతర్జాతీయ విద్యార్థుల జనాభాలో దాదాపు 41 శాతం భారతీయులే ఉన్నారు.ఈ నేపథ్యంలో ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులపైన,  ఇప్పటికే అక్కడున్న వారిపైనా, ఇరుదేశాల మధ్య వాణిజ్యంపైన తాజా వివాదం ప్రభావం పడే ప్రమాదం కనిపిస్తోంది.