calender_icon.png 2 April, 2025 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భగ్గుమన్న విభేదాలు

01-04-2025 12:36:07 AM

  1. హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం మధ్య ముదిరిన వివాదం
  2. కాంప్లిమెంటరీ పాస్‌ల జారీ విషయంలో గొడవ
  3. హెచ్‌సీఏ వేధింపులకు పాల్పడుతోందని ఆరోపణలు
  4. ఈ-మెయిల్ ద్వారా హెచ్‌సీఏకు లేఖను పంపిన ఎస్‌ఆర్‌హెచ్!
  5. కూర్చొని మాట్లాడుకుందామన్న హెచ్‌సీఏ
  6. హెచ్‌సీఏ వ్యవహారంపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశాలు

హైదరాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): ఐపీఎల్ టికెట్లు, కాంప్లిమెంటరీ (ఉచిత టికెట్లు) పాస్‌ల జారీ వ్యవహారంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్), హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మధ్య నెలకొన్న వివాదం ముదిరి పాకాన పడింది. అదనపు కాంప్లిమెంటరీ పాస్‌లు కావాలని హెచ్‌సీఏ ఉన్నతాధికారులు తమను వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఎస్‌ఆర్‌హెచ్ ఆరోపణలు చేయడం సంచలనం రేపింది.

ఇకపై పాస్‌ల విషయంలో హెచ్‌సీఏ ఇబ్బందులకు గురి చేస్తే హైదరాబాద్‌ను వీడాల్సి వస్తుందని యాజమాన్యం హెచ్‌సీఏకు స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌ల వేదికను వేరే చోటికి మార్చాలంటూ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌తో పాటు బీసీసీఐకి లేఖ రాసినట్టు సమాచారం.

కాగా హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు కాంప్లిమెంటరీ పాస్‌ల విషయమై వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఎస్‌ఆర్‌హెచ్ మేనేజర్ శ్రీనాథ్ ఈ ద్వారా హెచ్‌సీఏ కోశాధికారి సీజే శ్రీనివాస్‌కు లేఖ రాసిన విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది. దీనిపై వెంటనే స్పందించిన హెచ్‌సీఏ లేఖను విడుదల చేసింది.

ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం అధికారిక ఈ నుంచి తమకు ఎలాంటి సమాచారం రాలేదని పేర్కొంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని.. కొందరు వ్యక్తులు పనిగట్టుకొని హెచ్‌సీఏ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని తెలిపింది. తమకు, ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యానికి మధ్య ఎలాంటి వివాదాలు లేవని.. సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

తాజాగా హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్ వివాదంపై సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్‌ఆర్‌హెచ్‌పై హెచ్‌సీఏ బెదిరింపులకు పాల్పడిం దా? లేదా? అన్న అంశాన్ని తేల్చాలం టూ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.

ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వర్తిస్తోన్న సీనియర్ ఐఏఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి బాధ్యతలు అప్పజెప్పింది. ఈ అంశంపై విచారణ జరిపి త్వరలోనే పూర్తి స్థాయి నివేదికను అందించాలని కోరింది. ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ హెచ్చరించారు.

ఇలా అయితే హైదరాబాద్ వీడతాం

హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాస్‌కు రాసిన లేఖలో.. ‘ఒప్పందం ప్రకారం హెచ్‌సీఏకు 10 శాతం (3900) కాంప్లిమెంటరీ టికెట్లు కేటాయిస్తున్నాం. 50 సీట్ల సామర్థ్యం ఉన్న ఎఫ్ 12ఏ కార్పొరేట్ బాక్స్ టికెట్లు కూడా అందులో భాగమే. కానీ ఈ ఏడాది దాని సామర్థ్యం 30 మాత్రమే అని పేర్కొన్నారు. అదనంగా మరో 20 టికెట్లు కేటాయించాలని అడిగారు.

అయితే దీనిపై చర్చిద్దాం అని తెలిపాం. మ్యాచ్ నిర్వహణకు మేమే అద్దెను చెల్లిస్తున్నాం. ఐపీఎల్ సమయంలో స్టేడియం మా నియంత్రణలో ఉంటుంది. గత గురువారం లక్నోతో మ్యాచ్ సందర్భంగా ఎఫ్ బాక్సుకు తాళం వేశారు. అదనంగా మరో 20 టికెట్లు ఇస్తేనే తాళాలు తీస్తామని బెదిరించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇలా బెదిరింపులకు దిగడం అన్యాయం.

12 ఏళ్లుగా హెచ్‌సీఏతో ఎలాంటి ఇబ్బంది లేదు. గత రెండేళ్ల నుంచి మాత్రం వేధింపులు ఎక్కువయ్యాయి. ఇలాగే కొనసాగితే హైదరాబాద్‌ను వీడాల్సి వస్తోంది. బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌తో చర్చించి వేదికను మార్చాలని కోరుతాం’ అని ఎస్‌ఆర్‌హెచ్ మేనేజర్ శ్రీనాథ్ లేఖలో తెలిపారు. 

కూర్చొని మాట్లాడుకుందాం: హెచ్‌సీఏ

ఎస్‌ఆర్‌హెచ్ చేసిన ఆరోపణలపై సోమవారం రాత్రి హెచ్‌సీఏ మరోసారి స్పందించింది. ‘కోటాకు మించి అదనపు పాస్‌ల కోసం ఎస్‌ఆర్‌హెచ్‌ను ఎప్పుడు ఒత్తిడి చేయలేదు. కాంప్లిమెంటరీ పాస్‌ల కింద క్లబ్ సభ్యులకు 3900 టికెట్లు నేరుగా అందించాలని హెచ్‌సీఏ కోరింది. అలాగే హెచ్‌సీఏ అధ్యక్షుడు వ్యక్తిగతంగా 3900 టికెట్లు ఇవ్వాలని ఎక్కడా అడగలేదు.

టికెట్లు, పాసుల కోసం హెచ్‌సీఏ బ్లాక్ మెయిల్ చేస్తోందని ఎస్‌ఆర్‌హెచ్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యంలో పనిచేస్తున్న కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల చిన్న విషయాలపై నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఇలా ఆరోపణలు చేయడం కంటే కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయి.

ఎస్‌ఆర్‌హెచ్ అధికారులకు సమావేశ తేదీని ఫిక్స్ చేయాలని సూచిస్తూ లేఖను రాశాం’ అని తెలిపింది.అంతకముందు హెచ్‌సీఏ అధ్యక్ష కార్యాలయం స్పందిస్తూ.. ‘ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం నుంచి మాకు ఎలాంటి అధికారిక ఈమెయిల్ అందలేదు. సోషల్ మీడియా, వెబ్‌సైట్స్‌లో వస్తున్న వార్తలన్నీ అవాస్తవం’ అని పేర్కొంది.