calender_icon.png 23 October, 2024 | 4:50 PM

సర్వశాస్త్ర సారం భగవద్గీత

14-06-2024 12:00:00 AM

వేదాల సారం ఉపనిషత్తులు. ఉపనిషత్తుల సారం భగవద్గీత. ఉపనిషత్తులకు వేదాంత శాస్త్రమని, శ్రుతి శిరస్సులని పిలుస్తారు. వేదాంతంతో తెలుపబడిన సారభూతమైన సాహిత్యం అవడం వల్లే వేదాంతమని పేరు వచ్చింది. శరీరానికి శిరస్సు ప్రధానమైనట్లు శ్రుతులలో ప్రధాన భాగం కావడం వల్ల శ్రుతి శిరస్సు వంటిది. ఈ ప్రకారంగా ఉపనిషత్తులు భారతీయ ఆధ్యాత్మిక వాఙ్మయానికి కీలకస్థానం అయ్యాయి. మహెూన్నతమైన వేదవృక్షం ఫల స్వరూపమైన ఉపనిషత్తులను తెలుసుకోవడం ద్వారా మానవులు తమ జన్మను సార్థకత చేసుకోగలరు. కానీ, ఉపనిషత్తుల భాష, భావం సామాన్యులకు అంత తేలిగ్గా అవగాహన కాదు. ఈ సమస్యను పరిష్కరించడానికే భగవానుడు (శ్రీకృష్ణుడు) పూనుకొన్నాడు. తద్వార సామాన్యులకు మహెూపకారం చేశాడు. 

సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః 

పార్థోవత్సః స్యుధీర్భోక్తా దుగ్గం గీతామృతం మహాత్ వ

భగవద్గీత అనే సులభ సాహిత్యం ద్వారా శ్రీకృష్ణమూర్తి జనులందరికీ (లోకానికి) మహెూపకారం చేశాడు. గీత అర్జునునకు మాత్రమే బోధింపబడినదని అందరూ అనుకొంటారు.  కానీ, వాస్తవానికి అది విశ్వప్రాణి కోటికి ఉపదేశించబడింది. ఉపనిషత్తుల సారాన్ని భగవద్గీత ద్వారా గ్రహించి, అనుష్టించి భవదుఃఖాల నుండి అందరూ దూరం కావాలన్నదే ఇందులోని అసలు తత్వం.

అపార శాస్త్ర పారావారాన్ని మధించి వెలికి తీసిన సారమే ‘భగవద్గీత’. సర్వశాస్త్ర సిద్ధాంత సమన్వయ రూప గ్రంథం గీత. సర్వమత సంప్రదాయ తత్తాలను పరిపోక్షించేది భగవద్గీత. సమస్త మతాలలోని ప్రధాన సూత్రాలన్నీ, ధర్మాలన్నీ గీతలోనే క్రోడీకృతమైనాయి. వివిధ మత సిద్ధాంతాలు శాఖోపశాఖలతో విరాజిల్లే ధర్మవృక్షమే భగవద్గీత. సర్వధర్మ సమన్వయాల క్షేత్రం గీత. ప్రపంచంలోని సమస్త సంప్రదాయాల సమన్వయాలు, గీతలో కనిపిస్తాయి. కనుకనే దీనిని విశ్వమత గ్రంథమనీ అన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానానికి, సమస్త ధర్మాలకు నిఘంటువు. గీత సర్వశాస్త్ర పరిపూర్ణమైందని స్కాంద పురాణం చెబుతున్నది. గీతలోని గంభీర భావాలను, సర్వమత సమన్వయ ధోరణిని, అనంత జ్ఞానాన్ని, అంతులేని అర్థ పరంపరను పరిశీలించినప్పుడు, ఇది మానవ నిర్మితం కాదని స్పష్టమవుతుంది. భారతదేశ ధార్మిక జీవనంపై గీత ప్రభావం అనంతం. గీత మానవ జీవన వ్యవహారాన్ని వేదాంతస్థాయికి కొనిపోతుంది. సర్వయోగ సమన్వయం, సర్వభూత దయ, సర్వ సమన్వయ గుణం గీతలో వున్నాయి.

మహాభారతం అనే మహా సముద్రంలో దీపస్తంభం వలె గీత ప్రకాశిస్తూ ఉంటుంది. భారతమను క్షీరంలో గీత నవనీతమై వెలయుచున్నది. అష్టాదశ పురాణాలను, నవ వ్యాకరణాలను, నాలుగు వేదాలను చక్కగా మధించి వ్యాస మునీంద్రులు భారతాన్ని రచించాడు. ఆ భారతమే ‘పంచమవేదం’గా ప్రఖ్యాతి గాంచింది. ఈ మహెూత్కృష్ట కావ్యం నుండి భగవద్గీత వెలువడింది. ఆదిశంకరుల వారు గీతాభాష్యం చెబుతూ, సమస్త వేద వేదాంగాల సార సంగ్రహం ‘గీతాశాస్త్రం’ అన్నారు. గీతలో తెలుపబడింది అవ్యయమైన బోధ. దానికి నాశనం లేదు. దేశ కాలాలు మారినా అది మారదు, చెక్కుచెదరదు. అది యుగయుగాలకు పనికివచ్చే ధర్మం. ఈ తత్త్వబోధ అతి రహస్యమైంది, అఖండమైంది. సర్వమతసారం. సర్వదేశాలకు, సర్వ కాలాలకు, సమస్త సాంప్రదాయాలకు మూలమైంది.

జ్ఞానేశ్వరుడు గీతను గురించి ఈ విధంగా ప్రస్తుతించాడు. గీత వివేక వృక్షాలకు తోట, సకల సుఖాలకు పునాది. పరమార్థ సిద్ధాంతాల రత్నఖని. నవరసం అనే అమృతంతో నిండిన సముద్రం. తెరవబడి వున్న పరంధామం. సర్వవిద్యలకు మూల భూమి, సర్వశాస్త్రాలకు ఆశ్రయం, సర్వ ధర్మాలకు మాతృభూమి, సజ్జనులకు ప్రేమాస్పద మిత్రుడు, సరస్వతి లావణ్య రత్నాల భాండారం, జ్ఞానామృత పూర్ణ గంగా వివేకాన్ని క్షీర సముద్రంలో వెలిసిన నవలక్ష్మి. ఇంత గొప్పనైన భగవద్గీతను ఆశ్రయించేవారు ధర్మ రహస్యాలను అన్నింటినీ గ్రహించి అచిర కాలంలోనే పరమ శాంతిని పొందుతారు.

 కలకుంట్ల జగదయ్య