21-03-2025 05:16:48 PM
ఇల్లెందు,(విజయక్రాంతి): సమాజంలోని అంతరాలు తొలగిపోవాలంటే కమ్యూనిజమే అంతిమ మార్గమని నమ్మిన విప్లవకారుడు షాహిద్ భగత్ సింగ్ అని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ నబి, మండల కార్యదర్శి ఆలేటి కిరణ్ లు అన్నారు. సీపీఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజగురుల వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ లౌకిక సందేశ్ యాత్రను(Bhagat Singh Secular Sandesh Yatra) నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఇల్లందు మండలంలో వినోబా నగర్ లో కొవ్వొత్తుల ప్రదర్శన, బిల్డింగ్ అడ్డా, దేవులపల్లి యాకయ్య నగర్ లో ఏర్పాటు చేసిన సభలలో వారు మాట్లాడుతూ... భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజగురులు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటూనే ఈ సమాజంలో అంతరాలు అసమానతలు పోవడానికి గల కారణాలపై అనేక అధ్యయనాలు నిర్వహించారన్నారు. ఈ క్రమంలోనే రష్యన్ సోషలిస్ట్ విప్లవం పట్ల ఆకర్షితులై లెనిన్ రచించిన అనేక విప్లవకర సిద్ధాంతాలను అధ్యయనం చేశారని ఈ సందర్భంలోనే స్వతంత్ర ఉద్యమాలతో కమ్యూనిస్టు భావాలను కూడా కలిపి అనేక పోరాటలు నిర్వహించారని అన్నారు.
బ్రిటీష్ సామ్రాజ్యవాదుల మోచేతి నీళ్లు తాగి జైల్లో ఉండి బ్రిటిష్ వారిని క్షమాభిక్ష కోరిన దేశద్రోహి సావర్కర్ అని అటువంటి దేశ ద్రోహితో దేశం కోసం చిరునవ్వుతో ఉరికంబాలను ముద్దాడుతూ మరణించిన భగత్ సింగ్ ను ఆర్ఎస్ఎస్ బిజెపి లు పోల్చడం సిగ్గుమాలిన చర్యని అన్నారు. ఇటువంటి చర్యలను నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ భగత్ సింగ్ లౌకిక సందేశ యాత్రను నిర్వహిస్తున్నామని. ఈ సందర్భంగా దేశంలో ఉన్న ప్రజానీకానికి లౌకిక తత్వం పై ఉన్న గొప్పతనాన్ని చాటి చెబుతున్నామని అన్నారు. నాస్తికుడైన భగత్ సింగ్ సమాజ అంతరాల పట్ల కళ్ళున్న దేవుడు ఏం చేస్తున్నాడని ప్రశ్నించిన ఒక గొప్ప అభ్యుదయ వాది అని అన్నారు. భగత్ సింగ్ చరిత్రను వక్రీకరించడానికి అనేక కుట్రలు జరుగుతున్నాయని భగత్ సింగ్ ముమ్మాటికి ఒక విప్లవకారుడు, ఒక కమ్యూనిస్టు, ఒక పోరాట యోధుడని గుర్తు చేశారు. ఇల్లందు పట్టణంలో మార్చి 23 వ తారీఖున భగత్ సింగ్ యాత్ర ముగింపు సందర్భంగా కాగడలా ప్రదర్శన నిర్వహిస్తున్నామని ఈ సందేశ్ యాత్రలో విప్లవకారులు అభ్యుదయ భావాలు కలవారు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో తాళ్లూరి కృష్ణ, మన్నెం మోహన్ రావు, సంధ్య, మరియా, వజ్జ సురేష్, వెంకటమ్మ, యకమ్మ, నాగరాజు, సత్యనారాయణ కోరి, సోమలక్ష్మి, సంతోష, సుజాత, నీలారాణి, బద్రు, పాషా తదితరులు పాల్గొన్నారు.