18-03-2025 12:56:28 AM
బుకింగ్ పోస్టర్ ఆవిష్కరించిన ఆర్టీసీఎండీ సజ్జనార్
హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాం తి): శ్రీరామ నవమి పురస్కరించుకొని భద్రాచలంలోని సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలను కోరుకున్న భక్తుల ఇళ్లకు చేర్చాలని టీజీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. ఎప్పటిలాగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను హోం డెలివరీ చేయనున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది.
సోమవారం హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్‌ను టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆవిష్కరించి బుకింగ్ ప్రారంభించారు. భద్రాద్రిలో ఏప్రిల్ 6న అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవచ్చని తెలిపారు.
తలంబ్రాలు కావాల్సిన భక్తులు టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాలతో పాటు సంస్థ వెబ్‌సైట్ tgsrtclogistics.co.inలో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాలి. ఈ సేవను పొందాలనుకునేవారు టీజీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు 040 040 0ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ వి.రవిందర్, ఈడీ మునిశేఖర్, శ్రీధర్ పాల్గొన్నారు.