calender_icon.png 8 January, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామావతారంలో దర్శనమిస్తున్న భద్రాద్రి రామయ్య

06-01-2025 05:26:16 PM

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి అధ్యాయనోత్సవాలలో భాగంగా 7వ రోజు స్వామివారు శ్రీరామావతారం (స్వయం భూ)లో ముస్తాబై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీరామావతార రూపుడైన స్వామివారిని ఆలయ గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి మాడ వీధుల గుండా ఊరేగింపుగా వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, మహిళల కోలాటాల నడుమ తోడ్కొని వచ్చి మిథిలా స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో ఆశీనులు చేశారు. సందర్భంగా వేలాది మంది భక్తులు రామావతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో రమాదేవి, అధికారులు శ్రావణ్ కుమార్, రామకృష్ణ, సాయి బాబా, రవీంద్రనాథ్ తో పాటు దేవస్థానం వేద పండితులు అర్చకులు పాల్గొన్నారు.

శ్రీరామావతారం..

విశిష్టత... లోకకంఠకులైన రావణ కుంభకర్ణాది రాక్షసులను సంహరించడానికై దశరధుని కుమారుడిగా శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారం శ్రీరామావతారం. వ్యక్తిగత సౌఖ్యాల కన్నా ధర్మాచరణయే ఉత్తమమైనదని అదే శాశ్వతమైనదని భావించి, పరిపూర్ణమైన మానవుడు ఎలా ఉండాలో ఆచరించి చూపించిన ఆదర్శ పురుషుడు, మర్యాదా పురుషోత్తముడు, మూర్తీభవించిన ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు. సూర్య గ్రహ బాధలున్నవారు రామావతారాన్ని దర్శించడం వలన ఆ బాధల నుండి విముక్తి పొందుతారని భక్తుల విశ్వాసం.