భద్రాచలం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి అధ్యాయనోత్సవాలలో భాగంగా 8వ రోజు స్వామివారు శ్రీ బలరామావతారంలో ముస్తాబై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ బలరామావతార రూపుడైన స్వామివారిని ఆలయ గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి అనంతరం ఊరేగింపుగా వివిధ రకాల వేషధారణలు, డప్పు వాయిద్యాలు, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ మిథిలా స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపం వద్దకు తోడ్కొని వచ్చిన ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు.
అనంతరం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి అధికారులు రవీంద్రనాథ్ శ్రావణ కుమార్ రామకృష్ణ సాయి బాబా శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బలరామావతారం విశిష్టత... శ్రీహరికి శయనమైన ఆదిశేషుని అంశతో జన్మించి,కృషితో నాస్తి దుర్భిక్షం అన్నదానికి ప్రతీకగా నాగలిని ఆయుధంగా ధరించి శ్రీకృష్ణునికి అన్నగా నిలిచి, ఆయనకు ధర్మ స్థాపనలో సహకరించిన అవతారం శ్రీ బలరామ అవతారం, సంకర్షనునిగా పిలవబడే బలరాముడు ప్రలంబాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. ఈ అవతారాన్ని దర్శించినవారికి మాందీగుళికా గ్రహల బాధలు తొలగిపోతాయి అని భక్తుల విశ్వాసం.