భద్రాచలం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా 3వ రోజు గురువారం స్వామివారు వరాహావతారంలో ముస్తాబై భక్తులకు దర్శనమిచ్చారు. వరాహావతార రూపుడైన స్వామివారిని ఆలయ గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ మాడ వీధుల గుండా ఊరేగింపుగా మిథిలా స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపం వద్దకు తీసుకువచ్చి భక్తులు దర్శనం కోసం ఉంచారు. మిధున స్టేడియంలో వరాహతారంలో దర్శనమిచ్చిన రామయ్యను వేలాదిమంది భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రమాదేవి, ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
వరాహవతారం విశిష్టత...
ప్రజా సృష్టి చేద్దామన్న స్వయంభువుని, బ్రహ్మదుల మొరవిన్న నారాయణుడు నీటిలో మునిగివున్న భూమిని పైకి తీయడానికి వారాహావతారాన్ని ధరించాడు. భూమిని తన కోరలతో పైకి ఎత్తాడు. ఈ కార్యంలో ఆటంకం కలిగించిన లోక కంఠకుడైన హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని సంహరించి భూమిని రక్షించాడు. రాహుగ్రహ బాధలున్న వారు ఈ వరాహావతారం చూడడం వలన ఆ బాధల నుండి విముక్తి పొందుతారని విశ్వాసం.