calender_icon.png 9 January, 2025 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణావతారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య

08-01-2025 12:42:59 PM

భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయన  ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో తొమ్మిదవ రోజైన బుధవారం నాడు శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకృష్ణుని అవతారంలో ఉన్న స్వామి వారికి బేడా మండపంలో  వైభవంగా ఊంజల్ సేవ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

అనంతరం మంగళవాయిద్యాల నడుమ సకల రాజలాంఛనాలతో స్వామి వారిని ఊరేగింపు గా మాడ వీధుల గుండా వేదమంత్రోచ్చారణల నడుమ,కోలాటాల మధ్య మిధుల స్టేడియంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక మండపంలో ఆసీనులు చేశారు. సందర్భంగా స్వామివారిని వేలాదిమంది భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి అధికారులు రవీంద్రనాథ్ రామకృష్ణ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా రేపు సాయంత్రం 5 గంటలకి పవిత్ర గోదావరి నదిలో హంస వాహనంపై స్వామివారికి   తెప్పొత్సవం  నిర్వహించనున్నారు. జనవరి 10 వ తేదీ  ఉదయం తెల్లవారు జామున  ఐదు గంటలకు స్వామి వారు ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనము ఇవ్వనున్నారు.

శ్రీకృష్ణ అవతార విశిష్టత.....

దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా జన్మించి,  కంసుడు, శిశుపాలుడు, నరకాసురుడు, మొదలైనవారిని ఈ అవతారంలో సంహరించినట్లు వేద పండితులు తెలుపుతున్నారు. పాండవుల పక్షం వహించి కురుక్షేత్ర సంగ్రామం ఉపనిషత్తుల సారాంశమైన భగవద్గీతను బోధించిన శ్రీమన్నారాయణ అవతారమని  భక్త్తుల విశ్వాసం.