భద్రాచలం (విజయక్రాంతి): యావత్ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రంలో ఈ ఏడాది ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు డిసెంబర్ 31 నుండి జనవరి 20వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి దేవస్థానం అధికారులు, జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 31వ తేదీ నుండి భద్రాద్రి రామయ్య ప్రతిరోజు ఒక అవతారం చొప్పున దశావతారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అంతేకాకుండా ప్రధాన ఉత్సవమైన స్వామివారి తెప్పోత్సవం జనవరి 9వ తేదీ సాయంత్రం ఐదు గంటల నుండి పవిత్ర గోదావరి నది తీరంలో హంస వాహనంపై నిర్వహించనుండగా, ఆ మరునాడు 10 తేదీ ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు వైకుంఠ ద్వార దర్శనం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే జనవరి 26వ తేదీన విశ్వరూప సేవ ఒక పెద్ద ఎత్తున చేయడానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ముక్కోటి ఉత్సవాలను పురస్కరించుకొని భద్రాద్రి, వీధులలో దేవస్థానం వారి ఆధ్వర్యంలో భక్తులకు స్వాగతం పలికేందుకు స్వాగతం ద్వారాలు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రధాన దేవాలయాలను అనుబంధ దేవాలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరింపజేసి భక్తులు కనువిందు చేసేలా చర్యలు తీసుకున్నారు. ముక్కోటి ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా ఎంతమంది భక్తులు వచ్చినప్పటికీ వారందరికీ దైవదర్శనం స్వామివారి ప్రసాదం అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు దేవస్థానం తెలిపారు. అంతే కాకుండా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గోదావరి నది తీరంలో గిరిజన సాంస్కృతి సంప్రదాయాలు దేశవ్యాప్తంగా ప్రచారం జరిగేలా గిరిజన స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఆ స్టాల్స్ ద్వారా గిరిజన వంటకాలు రుచి చూసేలా ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవాలు విజయవంతం నిర్వహించడానికి జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో ఐటీడీపీఓ రాహుల్, ఆర్డిఓ దామోదర్, తాహసిల్దార్ శ్రీనివాస్, పంచాయతీ ఈవో శ్రీనివాస్ తో పాటు దేవస్థానం ఈవో రమాదేవి వారి సిబ్బంది విస్తృతంగా కృషి చేస్తున్నారు.