19-03-2025 01:39:05 AM
భద్రాచలం, మార్చి 18 (విజయ క్రాంతి) దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ గాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా మార్చి 30వ తేదీ నుండి ఏప్రియల్ 12వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉత్సవాలలో ప్రధాన ఘట్టాలైన శ్రీరామనవమి ఏప్రిల్ 6 తేదీన, పట్టాభిషేకం ఏప్రిల్ 7 తేదీన నిర్వహించనున్నారు. దేవస్థానం అధికారులు భద్రాచలం పట్టణంలోని ప్రధాన ఆలయం, అనుబంధ దేవాలయాలతో పాటు పట్నంలో పలు ప్రవేశ మార్గాలలో భక్తులకు స్వాగతం పలికేలా స్వాగత ద్వారాలు ఏర్పాటుచేసి ఆకర్షనీయంగా తీర్చిదిద్దుతున్నారు.
గోదావరి నది తీరం క్రింద ఉన్న కరకట్ట ప్రాంతంలో ఏర్పాటు చేసిన రామాయణ ఇతిహాసాల తెలిపే బాపు బొమ్మలకు సైతం రంగులతో తీర్చిదిద్దే పనిలో నిమగ్నులై ఉన్నారు. అంతేకాకుండా కళ్యాణం జరిగే మిదులా స్టేడియంలో కూడా పందిర్లు ఏర్పాటు చేసి భక్తులు కూర్చుని కళ్యాణం వీక్షించేలా ఏర్పాటు చేస్తున్నారు.
ఇప్పటికే శ్రీరామనవమి పట్టాభిషేకం టికెట్లు ఆన్లైన్ లో పెట్టి అమ్మకాలు జరుపుతుండగా నేరుగా కొనుక్కునే సౌకర్యం కూడా దేవస్థానం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే భక్తులు గోదావరి నది తీరంలో ఇసుక తిన్నెలపై అలాగే సాధువుల మండపం ప్రాంతంలో సేద తీరేందుకు అవసరమైన పందిరిలను సైతం దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. దేవదాయ శాఖ, గ్రామ పంచాయతీ, మిషన్ భగీరథ వైద్య ఆరోగ్యశాఖ లతోపాటు రెవెన్యూ పోలీస్ శాఖల సమన్వయంతో ఉత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు