24-02-2025 06:47:04 PM
అభినందించిన చైర్మన్ చీకటి కార్తీక్...
కొత్తగూడెం (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 34వ సబ్ జూనియర్ అంతర్రాష్ట్ర బాలబాలికల కబడ్డీ చాంపియన్ షిప్ పోటీల్లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్ లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జట్టు సత్తా చాటింది. కాగా బాలికల జట్టును సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ చీకటి కార్తీక్ అభినందించారు.
వారికి మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా చీకటి కార్తీక్ మాట్లాడుతూ... ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి జిల్లాలోని క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి, రాష్ట్ర స్థాయిలో సత్తా చాటేలా చేసేందుకు కృషి చేస్తున్నామని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహాయంతో జిల్లాలోని కబడ్డీ క్రీడాకారులకు సింథటిక్ మ్యాట్ తో కూడిన కబడ్డీ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తే స్పోర్ట్స్ కోటాలో భవిష్యత్ లో మంచి హోదాతో కూడిన ఉద్యోగాలు పొందే అవకాశం ఉందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, జాతీయ స్థాయిలో రాణించి భద్రాద్రి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ-భద్రాద్రి జిల్లా సెక్రటరీ కె స్వాతిముత్యం, ట్రెజరర్ నరేష్, కోచ్ సిహెచ్ రాంబాబు, వెంకట్, యూత్ కాంగ్రెస్ నాయకులు గులాం మతిన్, కుంచం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.