calender_icon.png 30 April, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాచలం సమస్యలను పరిష్కరించాలి

29-04-2025 07:57:58 PM

సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి..

సిపిఐ ఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం..

భద్రాచలం (విజయక్రాంతి): సిపిఐ ఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా భద్రాచలం పట్టణ వ్యాప్తంగా నివాస ప్రాంతాలలో సిపిఐ ఎం పార్టీ శ్రేణులు నిర్వహించిన స్థానిక సమస్యల సర్వేలో వచ్చిన సమస్యలను పరిష్కరించాలని పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్(District Collector Jitesh V Patil) కి మంగళవారం వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి మాట్లాడుతూ... పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీ వద్ద నిర్మిస్తున్న కరకట్ట పనులు నత్తనడకన సాగుతుండడంతో రానున్న వర్షాకాలం వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కరకట్ట పునర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు.

పట్టణ వ్యాప్తంగా అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ కారణంగా నివాస ప్రాంతాలలో మురుగునీరు చేరి దోమలు శరవిహారం చేస్తున్నాయని వెంటనే డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయాలని కోరారు. భద్రాచలం కేంద్రంగానే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించినప్పటికీ నేటికి భద్రాచలంలో ఇందిరమ్మ లబ్ధిదారుల వివరాలు అధికారులు బయటికి చెప్పడం లేదని ఇందిరమ్మ లబ్ధిదారుల లిస్టుల పేర్లతో గందరగోళాలను సృష్టిస్తున్నారని కలెక్టర్ జోక్యం చేసుకొని అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా కృషి చేయాలని కోరారు.

సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి అతి సమీపంలో చెత్త ఏయటంతో పాటు సాయంత్రం పూట దాన్ని తగలబెట్టడంతో రాష్ట్ర నలుమూలల నుండి వచ్చే యాత్రికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఒకటి రెండు మూడు వార్డు ప్రజలు ఆ చెత్తతో వచ్చే దుర్గంధం తో రోగాల పాలవుతున్నారని వెంటనే డంపింగ్ యార్డ్ ను అక్కడి నుండి తరలించాలని కోరారు. సిపిఐ ఎం బృందం ఇచ్చిన వినతి పత్రం పై స్పందించిన జిల్లా కలెక్టర్ వీలైనంత త్వరగా భద్రాచలం సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబు సున్నం గంగా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రం శెట్టి వెంకట రామారావు పారేల్లి సంతోష్ కుమార్ డి సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.