స్కిల్ యూనివర్సిటీలో ఫారిన్ లాంగ్వేజ్
కార్పస్ ఫండ్‌తో యూనివర్సిటీ నిర్వహణ
యూజీసీ గుర్తింపు కోసం కేంద్ర సాయం కోరతాం
ప్లేస్‌మెంట్ కోసం ‘డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ’
మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడి
హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీస్ ఇన్సురెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) సెక్టార్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. బీఎఫ్‌ఎస్‌ఐ కన్సార్టియం ద్వారా కామర్స్ కోర్సులను బ్యాంకింగ్ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు. దేశంలో ఈ కోర్సులను తీసుకొస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణేనని స్పష్టంచేశారు. ఈ కోర్సులను తీసుకురావడం ద్వారా ఏటా 20 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు.
గురువారం అసెంబ్లీలో ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎంఐఎం, బీజేపీ సభ్యులు యూనివర్సిటీపై పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ యువతకు భవిష్యత్‌కు సంబంధించిన ఆవిర్భావం స్కిల్ యూనివర్సిటీ రూపంలో జరుగుతున్న నేపథ్యంలో అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. స్కిల్ వర్సిటీ ఏర్పాటు నేపథ్యంలో గుజరాత్, హర్యానాలోని విశ్వవిద్యాలయాల్లో మెరుగైన విధానం ఉందని బీజేపీ సభ్యులు చెప్పారని, అయితే తమ అధికారుల బృందం ఇప్పటికే ఆయా ప్రాంతాలకు వెళ్లి స్టడీ చేసినట్టు వెల్లడించారు. కేంద్రం అమలు చేస్తున్న ‘వన్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ’ కార్యక్రమాన్ని తామూ పరిశీలిస్తామని తెలిపారు. జిల్లాల్లో స్కిల్స్ ఎలా ఉన్నాయి? అనే విషయాలను తెలుసుకునేందుకు ఎన్జీవోలతో సంప్రదిస్తామని చెప్పారు.
క్రమ పద్ధతిలో జిల్లాలకు..
ముచ్చర్లలో ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీని ప్రధాన కేంద్రంగా ఉంచి.. ఆ తర్వాత క్రమపద్ధతిలో జిల్లాలకు విస్తరిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. జిల్లాల్లో స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయడం ఈ ఏడాది సాధ్యం కాదని చెప్పారు. ముచ్చర్లలో యూనివర్సిటీ ఏడాదిలో పూర్తవుతుందని, వచ్చే సంవత్సరం నుంచి జిల్లాల్లో యూనివవర్సిటీకి అనుబంధంగా శాఖలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని పేర్కొన్నారు. ఇది గ్రామీణ యువతకు దోహదపడుతుందని, అలాగే, బడుగు, బలహీన వర్గాల యువత వ్యాపారవేత్తలుగా మారడానికి ఉపయోగపడుతుందని స్పష్టంచేశారు. తమ ప్రభుత్వం ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే లక్ష్యంతో పని చేస్తుందని, ఇప్పటికే 40 వేల ఉద్యోగాలు పునరుద్ఘాటించారు.
పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో వర్సిటీ
ఈ వర్సిటీ పేరును యంగ్ ఇండియా కాకుండా.. తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ అనిపెట్టాలని ఎంఐఎం సభ్యుడు జాఫర్ హుస్సేన్ కోరగా మంత్రి స్పందించారు. 1919లో నాడు మహాత్మా గాంధీ ‘యంగ్ ఇండియా’ పేరుతో గొప్ప మ్యాగజీన్‌ను తెచ్చాడని.. ఆయన స్ఫూర్తితో యూనివర్సిటీకి యంగ్ ఇండియా పేరును పెట్టినట్టును వివరించారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ)లో ఈ దీనిని తీసుకొస్తున్నట్టు వివరించారు. ప్రైవేటు సంస్థ భాగస్వామ్యంతో కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నామని, దానిద్వారానే వర్సిటీని నడిపించనున్నట్టు తెలిపారు. గత పదేళల్లో ఎంఎస్‌ఎంఈ పాలసీ లేదని, తాము తీసుకొస్తున్నామని స్పష్టంచేశారు. స్కిల్ యూనివర్సిటీలో ఒక ఫారెన్ లాంగ్వేజ్ కోర్సు ప్రవేశపెట్టడం ద్వారా యువతకు ఉద్యోగాలు మరింత త్వరగా లభించే అవకాశం ఉందని ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ సూచించారు. స్పందించిన మంత్రి ఆ అంశాన్ని పరిశీలిస్తామన్నారు.
ఏఐ, కోడింగ్ కోర్సులు..
స్కిల్ యూనివర్సిటీలో మిషన్ లెర్నింగ్, ఏఐ, కోడింగ్ తదితర కోర్సులను ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. 7వ తరగతి పాసైనా, 10వ తరగతి ఫెయిల్ అయిన వారికి కూడా ఈ యూనివర్సిటీ ద్వారా ఒకేషన్ కోర్సులను అందిస్తామని వెల్లడించారు. ఈ యూనివర్సిటీ డిగ్రీకి యూజీసీ గుర్తింపు ఉంటుందా? అని బీజేపీ సభ్యులు అడిగి ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. దీని ద్వారా అందించే పట్టాకు గుర్తింపు ఉంటుందని స్పష్టంచేశారు. యూజీసీ గుర్తింపు కోసం అవసరమైతే కేంద్రం సాయం తీసుకుంటామని చెప్పారు. ఇక్కడ అందజేసే కోర్సులకు జాతీయ స్థాయిలో గుర్తుంపు ఉండేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. దీనిపై ఇప్పటికే ‘నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్’ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడిందని చెప్పారు.
ఒకే గొడుగు కిందకు స్కిల్ సెంటర్లు
రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఐటీఐ లాంటి స్కిల్ ఇనిస్టిట్యూషన్స్, జేకేసీ లాంటి ప్రాగ్రామ్స్‌ను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని.. ప్రభుత్వం నిర్ణయించిన రూ.50 వేల ఫీజు పేదలకు భారంగా మారుతుందని, అన్ని కోర్సులను ఫ్రీగా అందించాలని అక్బరుద్దిన్ ఒవైసీ కోరారు. దీనికి మంత్రి బదులిస్తూ.. రూ.50వేల ఫీజును రీయింబర్స్‌మెంట్ కింద అవసరమైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. అలాగే, అన్ని స్కిల్ కోర్సులను యూనివర్సిటీ పరిధిలో ఒకే గొడుగు కిందకు తీసుకొస్తామని వివరించారు.
ఈ ఏడాది స్కిల్ కోర్సులు ప్రారంభం: మండలిలో మంత్రి శ్రీధర్‌బాబు
రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి మార్గం చూపించేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. అతి త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. మరో 20 లక్షల మంది ఉపాధి కోసం ప్రయత్నాలు చేస్తున్నామని స్పష్టంచేశారు. పట్టభద్రుల్లో పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు కొరవడ్డాయని, వారిలో నైపుణ్యాల పెంపుపై పారిశ్రామిక వేత్తలు, వీసీలు, విద్యార్థులతో చర్చించి స్కిల్ యూనివర్శిటీ స్థాపనకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
ప్రభుత్వం చేపట్టే నియామకాలతో అందరికి ఉద్యోగాలు దొరకడం కష్టమని, ఇతర ఉపాధి మార్గాలు చూపిస్తే జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. అన్ని కోర్సుల్లో 50శాతం ప్రాక్టికల్ కాంపోనెంట్ కలిగి ఉంటాయన్నారు. గురువారం ఆయన శాసన మండలిలో స్కిల్ యూనివర్శిటీ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. వర్సిటీలో ఆరు కోర్సుల్లో అందుబాటులోకి తీసుకురాన్నుట్లు, ఈ ఏడాది ఒకేసారి 2 వేల మందితో ఆరు కోర్సులను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. వీటి ద్వారా రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయని చెప్పారు. విపక్ష నేతలు తగిన సూచనలు, సలహాలు ఇచ్చి యువతకు ఉపాధి మార్గం చూపేందుకు తనవంతు కృషి చేయాలని కోరారు.
అసెంబ్లీలో స్కిల్ యూనివర్సిటీ బిల్లుకు ఆమోదం
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మంగా భావిస్తున్న ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ బిల్లుకు గురువారం అసెంబ్లీ ఆమెదం తెలిపింది. తొలుత ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దీనిపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఆ తర్వాత బిల్లును ఆమోదానికి శ్రీధర్‌బాబు ప్రతిపాదించగా.. స్పీకర్ చదివి వినిపించారు. అనంతరం సభ్యుల మద్దతుతో బిల్లును ఆమోదిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. కాగా, యంగ్ ఇండియన్ స్కిల్ యూనివర్సిటీ బిల్‌ను బీజేపీ స్వాగతిస్తున్నట్టు బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఒకవేళ జిల్లాల్లో స్కిల్ కేంద్రాలు ఏర్పాటు చేసే ఆలోచన ఉంటే గల్ఫ్ బాధితులకు శిక్షణ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
త్వరలో జాబ్ క్యాలెండర్
- 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం
- అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు
ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, దాని ద్వారా రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు. గురువారం శాసన సభలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. 2 లక్షల ఉద్యోగాలు కల్పించినా మరో 20 లక్షల మంది ఉపాధి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటామని చెప్పారు.
యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు పారిశ్రామికవేత్తలు, వీసీలు, విద్యార్థులతో పలు దఫాలు చర్చించి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ స్థాపనకు ప్రతిపాదిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రానికి సంబంధించి దాదాపు 30 లక్షల నిరుద్యోగులకు సంబంధించిన ఈ బిల్లు విషయంలో ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. స్కిల్స్ యూనివర్సిటీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని తద్వారా రాష్ర్ట ఆర్థిక వృద్ధిని పెంచుతుందన్నారు. రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమల స్థాపనకు ఈ కొత్త యూనివర్సిటీ ఊతమిస్తుందన్నారు.
సస్పెండ్ చేయడమనేది చివరి ఆలోచన
స్కిల్స్ యూనివర్సిటీపై చర్చ జరుగుతున్న సమయంలో బీఆర్‌ఎస్ సభ్యులు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభకు అంతరాయం కలిగిస్తున్న సందర్భంలో ఎంఐఎం పక్ష నేత చేసిన సూచనపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. అసెంబ్లీలో ముఖ్యమైన బిల్లుల సందర్భంగా చర్చ జరుగుతుంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్షం కూడా సభలో ఉండి చర్చ జరగాలని, చక్కని చర్చ జరగాలని తాము భావిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. నిరసనలు తెలిపిన వారికి తాము భయపడటం లేదని చెప్పారు. సభలో అందరికీ మర్యాద ఇస్తామని అన్నారు. సభలో నిరసన తెలుపుతున్న సభ్యులను సస్పెండ్ చేయడం పెద్ద విషయం కాదని.. కానీ, అది చివరి చర్య మాత్రమేనని స్పష్టంచేశారు.