శిక్షణ పూర్తి చేసిన వారికి విస్తృత ఉద్యోగ అవకాశాలు
త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరణ
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): యువతకు ఉపాధి కల్పించేందుకు గానూ ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉన్న రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచే నూతన కోర్సులను ఆవిష్కరిస్తోంది. తాజా గా బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్స్యూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) కోర్సును అందుబాటులోకి తెస్తున్నారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా రంగాల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండటంతో ఇంజినీరింగ్‌లో వీటిని ఒక మైనర్ డిగ్రీగా తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రవేశపెడుతోంది.
ఈ కోర్సును త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. ముందస్తుగా నిర్ణయించిన ప్రకారం నేడు (ఈ నెల 3న) ఈ కోర్సును ప్రారంభించాల్సి ఉండగా, వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన నేపథ్యంలో కార్యక్రమాన్ని రద్దు చేశారు. త్వరలోనే ప్రోగ్రామ్ వివరాలను తెలియజేస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు
ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా లభించనున్నాయి. బ్యాంకింగ్, బీమా, ఫైనాన్స్ రంగాల్లో సేవలను అందిస్తున్న వివిధ అంతర్జాతీయ సంస్థలన్నీ బీఎఫ్‌ఎస్‌ఐ కన్సార్షియంగా ఏర్పడ్డాయి. ఆ సంస్థే ఈ కోర్సుకు సంబంధించిన కరిక్యూలమ్‌ను రూపొందించింది. ఆ సంస్థ ప్రతినిధులే విద్యార్థులకు పాఠాలు బోధిస్తారు. డిగ్రీతోపాటు ఇంజినీరింగ్ సహా ఎవరైనా ఈ కోర్సును తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఏడాది ఇంజినీరింగ్‌లో 5 వేల మంది, నాన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో 5 వేల మందికి ప్రవేశాలను కల్పించనున్నారు.
ఈ కోర్సు పూర్తి చేసిన వారికి జేపీ మోర్గాన్, లండన్ స్టాక్ ఎక్సేంజ్, స్టేట్ స్ట్రీట్, హెచ్‌ఎస్‌బీసీ వంటి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌లో అవగాహన ఒప్పందం కుదుర్చుకొని కోర్సును అందుబాటులోకి తెస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి కోర్సుల్లో భాగంగా ఈ కోర్సును తీసుకోవచ్చు. రెగ్యులర్ డిగ్రీకి ఇది అదనం. ఈ కోర్సు చేసినవారిని ఆయా కంపెనీలు నేరుగా రిక్రూట్‌మెంట్ చేసుకుంటాయి. ఈ కోర్సులో చేరినవారు బీఎఫ్‌ఎస్‌ఐ కన్సార్షియంలోని కంపెనీల్లో ఇంటర్న్‌షిప్, అప్రెంటిస్‌షిప్ చేయాల్సి ఉంటుంది.