calender_icon.png 26 November, 2024 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఎఫ్‌ఎస్‌ఐ కేరాఫ్ హైదరాబాద్!

26-11-2024 01:04:09 AM

  1. జీసీసీల ఏర్పాటులో దేశంలోనే రెండోస్థానం
  2. 2030 కల్లా దేశంలో బీఎఫ్‌ఎస్‌ఐ జీసీసీలు రెట్టింపు
  3. ఒక్క భాగ్యనగరంలోనే 1౯ శాతం ఉద్యోగులు

హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): ప్రపంచస్థాయి ఐటీ హబ్‌గా హైదరా బాద్ పేరుగాంచింది. అదే తరహాలో ప్రస్తుతం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్స్యూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగాల్లోనూ అద్భుత ప్రదర్శన కనబరుస్తుంది. తద్వారా ప్రపంచస్థాయి బీఎఫ్‌ఎస్‌ఐ కంపెనీలను ఆకర్షిస్తున్నది.

నగరంలో పెరిగిన ఆఫీస్ స్పేస్ లీజ్‌ను గమనిస్తే హైదరాబాద్‌లో బీఎఫ్‌ఎస్‌ఐ రంగాలకు సంబంధించిన వృద్ధిరేటు స్పష్టమవుతోంది. తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్‌లో పారిశ్రామిక, వ్యాపార అనుకూల వాతావరణం, నైపుణ్యమున్న మానవ వనరులు ఈ రంగాల్లో కంపెనీలను పెట్టుబడి పెట్టేందుకు ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

బీఎఫ్‌ఎస్‌ఐ రంగాల జీసీసీల ఏర్పాటులో హైదరాబాద్ ముందంజలో ఉంటుంది. ఈ జాబితాలో దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో బెంగళూరు నిలువగా, హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచిందని ఇటీవల విడుదల చేసిన ఒక నివేదికలో వెల్లడైంది. 

2030 కల్లా రెట్టింపు 

దేశంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్స్యూరెన్స్ రంగాలకు చెందిన గ్లోబల్ కేపబులిటీ సెంటర్ (జీసీసీ)లు గణనీయంగా పెరుగుతున్నాయి. 2030 కల్లా దేశంలోని జీసీసీల సంఖ్య రెట్టింపు కానున్నది. ప్రస్తుతం బీఎఫ్‌ఎస్‌ఐ రంగాలకు చెందిన జీసీసీలు 120 ఉండగా, 2030 వరకు 250 ఏర్పాటు అవుతాయని నివేదిక స్పష్టంచేసింది.

జీసీసీ ఏర్పాటులో బెంగళూరు, హైదరాబాద్ నగరాలు టాప్‌లో కొనసాగనున్నాయి. దేశంలోని మొత్తం బీఎఫ్‌ఎస్‌ఐ జీసీసీలలో ఒక్క బెంగళూరులోనే 35 శాతం ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న 120 జీసీసీలలో 42 జీసీసీలు ఆ నగరంలోనే ఉండటం విశేషం. వీటి ద్వారా 26 శాతం ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నది.

16 జీసీసీలతో హైదరాబాద్ రెండో స్థానంలో ఉండటంతోపాటు 19 శాతం ఉద్యోగావకాశాలు అందిస్తున్నది. నైపుణ్యమున్న మానవ వనరులు కలిగి ఉండటంతో హైదరాబాద్ నగరం బీఎఫ్‌ఎస్‌ఐ జీసీసీల ఏర్పాటుకు కేంద్రంగా మారుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జీసీసీల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది. 

భవిష్యత్‌లో 10 లక్షల ఉద్యోగాలు

బీఎఫ్‌ఎస్‌ఐ రంగాల్లో ఉద్యోగ అవకాశం కోసం దేశంలో లక్షలాది మంది ఎదురుచూస్తున్నట్టు నివేదికలో తేలింది. నైపుణ్యమున్న 2.41 లక్షల మంది అభ్యర్థులు బీఎఫ్‌ఎస్‌ఐ రంగాల్లో ఉద్యోగం కోసం ఆసక్తిగా చూపుతున్నారు. ఆదర్శవంతమైన వ్యాపార వాతావరణం ఉండటంతో జీసీసీల వృద్ధి, ఆవిష్కరణలకు ఎంతో దోహదపడుతుంది.

2030 వరకు దేశవ్యాప్తంగా ఏర్పాటు కానున్న 250 బీఎఫ్‌ఎస్‌ఐ జీసీసీల ద్వారా దాదాపు 10 లక్షల మందికి ఉద్యోగాలు లభించనున్నాయని నివేదిక స్పష్టం చేసింది. దీంతో హైదరాబాద్‌లోనూ అనేక ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని అనుకూల వాతావరణం కారణంగా బీఎఫ్‌ఎస్‌ఐ రంగాల్లో స్టార్టప్‌ల ఏర్పాటు కూడా అద్భుతంగా పెరుగుతుంది.

రాబోయే కాలంలో మరిన్ని ప్రపంచస్థాయి బీఎఫ్‌ఎస్‌ఐ జీసీసీలను ఆకర్షించి తెలంగాణ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలను అందించడంలో హైదరాబాద్ నగరం ముందుంటుందని నివేదిక స్పష్టంచేస్తుంది.