calender_icon.png 23 October, 2024 | 6:00 PM

సీజనల్ వ్యాధులతో జాగ్రత్త!

15-07-2024 12:05:00 AM

వాతావరణం ఉన్నట్టుండి మారడంతో సీజనల్ వ్యాధులు కూడా అంతే వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పుల దృష్ట్యా వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సరైన జాగ్రత్తలు పాటిస్తే వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ సీజనల్ వ్యాధులు అంటే ఏంటి? ఎలా వస్తాయి? వాటి లక్షణాలు ఏంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.. 

వైరల్ ఫీవర్.. దీన్నే సీజనల్ ఫీవర్ అని కూడా అంటారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఇది వ్యాప్తి చెందుతుంది. ప్రధానంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు దీనిబారిన పడుతుంటారు. శరీరంలోని కణాల మీద వైరస్ దాడి చేస్తుంది. చాలా వరకు వైరల్ ఫీవర్‌తో శరీరంపై భాగం ఎక్కువగా ప్రభావితమవుతుంది. ముఖ్యంగా శ్వాస వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. వైరస్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటే నరాల మీద దాడి చేస్తుంది. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వైరల్ జ్వరాలు అకస్మాత్తుగా సోకుతాయి. తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి 102 డిగ్రీల జ్వరం ఉంటుంది. తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పుల మధ్య నిసత్తువగా మారిపోతారు. కొందరిలో ఒంటిపై దద్దుర్లు, వాంతులు, అరుదుగా విరేచనాలూ కనిపిస్తాయి. మరికొందరిలో జలుబు వంటి లక్షణాలేవీ లేకుండా జ్వరాలు వస్తాయి. మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటి వైరల్ ఫీవర్ కిందకే వస్తాయి. 

వానకాలం దోమలు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటాయి. కాల్వల్లో పేరుకున్న మురుగు, నిల్వనీరు దోమలకు ఆవాసంగా మారతాయి. దోమల కారణంగా మలేరియా, చికున్ గున్యా, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా మలేరియా అనాఫిలిస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. కుట్టిన దోమలో ప్లాస్మోడియం పరాన్న జీవి ఉంటే మలేరియా వస్తుంది. సకాలంలో చికిత్స తీసుకోకపోతే.. సెరిబ్రల్ మలేరియాకు దారి తీయొచ్చు. ఇది ప్రాణాంతక పరిస్థితి. మూత్ర పిండాల వైఫల్యం, కామెర్లు, శ్వాసకోశ రుగ్మతలకు దారి తీస్తుంది. అధిక తేమ, ఉష్ణోగ్రత మార్పులు ఇన్‌ఫ్లుయెంజా వ్యాప్తికి అనువుగా ఉంటుంది. ఇన్‌ఫ్లుయెంజా ఈ వైరస్ సోకినప్పుడు జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, తుమ్ములు, తల నొప్పి, ముక్కు కారడం, అలసట, విరేచనాలు, ఊపిరి సరిగా ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో చికిత్స తీసుకోకపోతే.. న్యూమోనియా, ఉబ్బసం, డయాబెటిస్, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దోమల నివారణకు తగిన జాగ్రత్తలు పాటించాలి.  

వైరల్ ఫీవర్‌కు కారణం..

వైరల్ ఫీవర్ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. కొన్నిసార్లు శ్వాస నాళాల ద్వారా కూడా వ్యాపిస్తుంది. కలుషిత నీరు, ఆహారం తీసుకున్నప్పుడు వైరల్ ఫీవర్స్ వస్తాయి. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత తప్పకుండా పాటించాలి. ఇంటి ఆవరణంలో పూల తొట్లలో నిలిచిన నీటిని తొలగించడంతో పాటు పాత టైర్లు, పాత డబ్బాల్లో నిలిచిన నీటిని తొలగించాలి. ఇంటి పరిసరాల్లో దోమలు విజృంభించకుండా సరైన జాగ్రత్తలు పాటించాలి. 

వ్యాధులు-వాటి లక్షణాలు

డెంగ్యూ: ఇది దోమ కాటు వల్ల వస్తుంది. 

లక్షణాలు: జలుబు, దగ్గు, తరచుగా తుమ్ములు, తలనొప్పి రావడం. కీళ్ల నొప్పులు, ప్లేట్‌లెట్స్ పడిపోవడం. 

మలేరియా: మురుగు లేదా నిల్వ ఉండే నీటిలో ఏర్పడే ఆడ అనోఫెల్స్ దోమ వల్ల ఏర్పడుతుంది. 

లక్షణాలు: చలి జ్వరం, కడుపులో నొప్పి, ఒళ్లు నొప్పులు, అతిగా చెమట పట్టడం. 

వైరల్ ఫీవర్: ఇది అంటు వ్యాధి. ఎక్కువ వానలో తడిచినా, తడి బట్టల్లో ఎక్కువ సేపు ఉన్నా.. దగ్గు కారణంగా వైరల్ ఫీవర్ వస్తుంది. 

లక్షణాలు: గొంతు నొప్పి, కండరాల నొప్పులు, ఆయాసం, ముక్కుకారడం. 

డయేరియా: కలుషిత ఆహారం లేదా నీరు వల్ల వస్తుంది. 

లక్షణాలు: ఆయాసం, తిమ్మిరులు, వాంతులు, నీరసం, అలసట.

టైఫాయిడ్: కలుషిత నీరు, లేదా ఆహారం వల్ల వస్తోంది. 

లక్షణాలు: తలనొప్పి, గొంతునొప్పి, జ్వరం.

లెప్టోస్పిరోసిస్: శరీరంపై గాయాలున్న వారు మురుగునీటిలో నడిస్తే వస్తుంది. 

లక్షణాలు: తలనొప్పి, కళ్ల నొప్పి, శరీరం బిగుతుగా అనిపించటం, జ్వరం మనం తాగే నీటి ద్వారానే 40 శాతం వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాచి చల్లార్చిన నీటిని తాగితే  చాలా వరకూ వ్యాధులకు దూరంగా ఉండే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. 

తీసుకోవాల్సిన ఆహారం..

* విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల వైరస్‌పై పోరాడి ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. టమోటా, నారింజ, నిమ్మ, కివి పండ్లల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. 

* శరీరం కోల్పోయిన యాంటీ బాడీ కణాలు తిరిగి పునః నిర్మితం కావడంలో తోడ్పడుతుంది. గుడ్లు, పెరుగు, పాలు, సీఫుడ్స్‌లలో జింక్ పుష్కలంగా ఉంటుంది. 

* ప్రతిరోజూ ఒక కప్పు తాజా పెరుగును తీసుకోవాలి. ఇది జీర్ణాశయంలో ఉండే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. 

* ప్రతిరోజూ క్యారెట్ తినాలి. దీనిలో ఉండే బీటా కెరోటిన్, విటమిన్ బి6లు యాంటీ ఆక్సిడెంట్ కణాలను ఉత్పత్తిని పెంచుతుంది. దీనిలో ఉండే మినరల్స్ బ్యాక్టీరియా, ఫంగస్ ఇన్‌ఫెక్షన్లపై పోరాడేలా చేస్తాయి. ప్రతిరోజూ ఆహారంలో ఒక స్ఫూన్ వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. 

* రోజూ నాలుగు లేదా ఐదు ఖర్జూరాలను తీసుకోవడం వల్ల శరీరంలో సరిపడా ఐరన్ అందుతుంది. దీనిలో విటమిన్ సి, పొటాషియం అధిక మోతాదులో ఉంటాయి. దీనివల్ల అధిక రక్తపోటుని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు: 

  1. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకూడదు.
  2. దోమలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి.
  3. నిండుగా దుస్తులు ధరించాలి.
  4. స్వచ్ఛమైన, ఫిల్టర్ చేసిన, కాచి చల్లార్చిన నీరే తాగాలి.
  5. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి.
  6. తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు నోటికి చేయి అడ్డుపెట్టుకోవాలి.
  7. జనసాంద్రత ఉన్న ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాస్క్ కచ్చితంగా వాడాలి.

నివారణ చిట్కాలు..

  1. దగ్గినప్పుడు లేదా తుమ్మేటప్పుడు నోటి వద్ద ఖర్చీఫ్ పెట్టుకోవాలి. ఇంట్లో ఎవరైనా సీజనల్ వ్యాధుల బారినపడిన వారి నుంచి పిల్లల్ని దూరంగా ఉంచాలి. 
  2. పిల్లలు బయట నుంచి ఇంటికి వచ్చాక చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కుని రావాలని చెప్పాలి. 
  3. రెండు, మూడు గంటలకు ఒకసారి గోరు వెచ్చని నీరు తాగాలి. ప్రతి సంవత్సరం పిల్లలకు ఫ్లూ వ్యాక్సిన్ వేయించాలి. 
  4. అలాగే సరైన పోషకాహారాన్ని తీసుకోవాలి. విటమిన్లు, మినరల్స్, పోషకాలు రోగనిరోధకశక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. 

అప్రమత్తంగా ఉండాలి!

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి. జ్వరం వస్తే డాక్టర్‌ను సంప్రదించాలి. దోమ తెరలను వినియోగించాలి. చల్లటి ఆహార పదార్థాలు కాకుండా వేడి పదార్థాలను తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగితే మంచిది. పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. అంటు వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు పాటించాలి. గదులను గాలి, వెలుతురు ఉండే విధంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా స్ట్రీట్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. బయట ఆహారం తినడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్ (గ్యాస్ట్రో ఎన్టీరైటిస్) వంటివి వస్తుంటాయి. దీనివల్ల కడుపులో ఇన్ఫెక్షన్ కలుగుతుంది. జీర్ణాశయ గోడలు (లైనింగ్), పొట్ట, పేగుల వాపునకు దారితీస్తాయి. ఇంటి పరిసర ప్రాంతాల్లో మురుగు నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. కాలువల్లో ఆయిల్ బాల్స్, మలాథీయాన్, బయోటెక్స్ వంటి వాటిని చల్లించాలి. తరచూ బ్లీచింగ్ చల్లించడం మంచిది. ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రం చేయించుకోవాలి. రక్షిత మంచినీటితే తాగాలి. 

 డాక్టర్ వళ్లకొండ దీపక్ కుమార్

ఎంబీబీఎస్, ఎండి

 కన్సల్టెంట్ ఎండి ఫిజిషియన్

మెడికవర్ హాస్పిటల్, హైదరాబాద్