చాలా పట్టణాలు, నగరాలు, ఊళ్లలో ప్రజా మరుగుదొడ్లు ఉండ వు. మార్కెట్ల సమీప ప్రాంతాలు అయితే మలమూత్ర విసర్జనలకు నిలయాలుగా కనిపిస్తున్నాయి. ఉన్న కొద్ది పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ సరిగా లేక భయంకరంగా ఉంటున్నాయి. అపరిశుభ్రత తాండ విస్తుంటుంది. ఫర్లాంగు దూరం వరకూ దుర్వాసన వ్యాపిస్తుంది. పెద్ద షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, లాడ్జిలలోకి బయటి వారికి అనుమతి ఉండదు. ఈ రోత భరించలేక పురుషులు చాలామంది గుట్టు చప్పుడు కాకుండా పబ్లిక్ స్థలాలలో మూత్ర విసర్జన చేస్తున్నారు. హైదరాబాద్ వంటి మహానగరాల వాణిజ్య సముదాయాల్లోనూ చాలా వాటికి మరుగుదొడ్లు కనిపించడం లేదు.
మున్సిపల్ నిబంధనల ప్రకారం ప్రతి అంతస్తుకు సామూహిక మూత్రశాల ఉంటేనే అనుమతులు ఇవ్వాలి. కానీ, అధికారులు అవేమీ పట్టించుకోకుండా అనుమతులు ఇచ్చేయడం దారుణం. రహదారుల్లో అక్కడక్కడ, రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు, కూరగాయలు, మటన్, చికెన్, చేపల మార్కెట్ల లో పరిస్థితులైతే చాలా అధ్వానంగా తయారయ్యాయి. ‘సులభ్ కాంప్లెక్స్’ల నిర్వహణ కూడా సవ్యంగా ఉండటం లేదు. ‘స్వచ్ఛ భారత్ సెస్’ ఎందుకు వసూలు చేస్తున్నారో, నిధులు ఎక్కడ ఖర్చు చేస్తున్నారో తెలియని పరిస్థితి. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలకు విస్తారంగా పబ్లిక్ టాయ్‌లెట్స్ సౌకర్యాలను ఏర్పరచాలి.
డా.యం. సురేష్ బాబు