కోవిడ్-19 మహా విపత్తు ప్రపంచ మానవాళికి కఠినమైన గుణపాఠం నేర్పింది. చైనాలో బయటపడిన కరోనా వైరస్ గంటల్లో ప్రపంచాన్ని కమ్మేసింది. అంటువ్యాధులకు దేశ సరిహద్దులు తెలియవు, వయోపరిమితులను సహితం లెక్క చేయవు. పిల్లలను,మహిళలను సైతం వదిలి పెట్టడం లేదు. ఎనిమిది బిలియన్లకు పైగా ప్రపంచ జనాభా ఇంట్లో కూర్చొని గజగజ వణికి పోయింది. కరోనా వైరస్ లక్షల ప్రాణాలను బలి తీసుకుంది.
కరోనా విపత్తు నేర్పిన పాఠాన్ని విశ్లేషించిన ఐరాస 2020 డిసెంబర్ 27న నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో అంటువ్యాధుల కట్టడి, ఆరోగ్య సంరక్షణ పద్దతులు, వ్యాధి నిర్థారణ, చికిత్స విధానాలు లాంటి అంశాలను చర్చించడానికి ప్రతి ఏటా డిసెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అంటువ్యాధుల సంసిద్ధత దినం లేదా ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్నెస్’ను పాటించాలని నిర్ణయించింది. గతంలో కలరా, ఎబోలా, మీసిల్స్, మలేరియా, -ఎయిడ్స్, పోలియో, క్షయ లాంటి వ్యాధులు ప్రపంచ జనాభాను తీవ్రంగా వణికించాయి. నేడు అంటువ్యాధులు, మహమ్మారి మహా విపత్తులు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. రానున్న రోజుల్లో తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయని వింటున్నాం.
అంటువ్యాధులు ఎగిసి పడినపుడు వాటి కట్టడి మార్గాలు, నిర్థారణ పద్ధ్దతులు, సమర్థవంతమైన పర్యవేక్షణ, సత్వర వైద్యచికిత్సలు లాంటి అంశాలను అవగాహన పరచడానికి అంతర్జాతీయ అంటువ్యాధుల సంసిద్ధత దినం నిర్వహించడం 2020 తర్వాత ఆనవాయితీగా మారింది. ముసురుకుంటున్న అంటువ్యాధులను కట్టడి చేయడానికి అంతర్జాతీయ సంస్థలు, ప్రజారోగ్య వ్యవస్థలు, పౌర సమాజం, ప్రతి వ్యక్తి సంసిద్ధంగా, సంఘీభావంతో ఉంటూ సమైక్యంగా పోరాడవలసి ఉందని తెలుసుకోవాలి.
అంటువ్యాధులు ప్రబలడంతో దేశాల సామాజిక, ఆర్థిక అభివృద్ధులు దీర్ఘకాలికంగా చితికిపోవడం జరుగుతున్నది. అంతర్జాతీయ స్థాయి నుంచి కుటుంబం వరకు అందరూ అం టువ్యాధుల నిర్మూలనకు కృషి చేయాలి. అంటువ్యాధుల జననం, విస్తరించడం, తీవ్ర ప్రభావాలను చూపడం బహుముఖీన కోణంలో అర్థం చేసుకోవాలి. పర్యా వరణ విధ్వంసం, జీవవైవిధ్యతకు విఘా తం కలిగించడం, వన్యసాధు జంతువుల సంరక్షణ, వ్యక్తిగత ఆరోగ్యం లాంటివి ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటు న్నాయి.
విస్తరిస్తున్న జునోటిక్ వ్యాధులు
మానవులకు సంబంధించిన అంటువ్యాధుల్లో 6075 శాతం వరకు జునోటిక్ (జంతువుల నుంచి సంక్రమించే ) వ్యాధులుగా గుర్తించారు. అంటువ్యాధుల వ్యాప్తి మనిషి, పర్యావరణం, జంతువుల మధ్య సంబంధాన్ని రుజువు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్త సహకారం కేంద్రంగా వన్ హెల్త్ అప్రోచ్ ద్వారా దేశ సరిహద్దులను దాటి సమైక్యంగా వ్యాధికారక సూక్ష్మజీవులపై యుద్ధం ప్రకటించాల్సి ఉన్నది. మానవాళి శ్రేయస్సే లక్ష్యంగా సురక్షిత నీరు, శక్తి వనరులు, ఆహారం, వాతావరణమార్పులు లాంటి అంశాల్లో బహుముఖీన స్థాయిలో సానుకూల చర్యలు తీసుకోవాలి.
పర్యావరణ వ్యవస్థలను విధ్వంసం చేయడం, అక్రమ వన్యప్రాణుల వ్యాపారాలు, సాధు జంతువుల పెంపకాల్లో అవలక్షణాలు, మానవాళి అనాలోచిత జీవన విధానాలు లాంటివి అంటువ్యాధులు రెచ్చిపోవడానికి కారణం అవుతున్నాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని సరైన ముందడుగు వేస్తేనే అంటువ్యాధులపై యుద్ధంలో మనిషి విజేత కాగలడని తెలుసుకొని బుద్ధితో బతుకులు కొనసాగిద్దాం.
డా.బుర్ర మధుసూదన్ రెడ్డి