calender_icon.png 28 October, 2024 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిజిటల్ అరెస్ట్‌పై జాగ్రత్త

28-10-2024 12:00:00 AM

  1. దర్యాప్తు సంస్థలు వీడియోకాల్స్ చేయవు
  2. ఆన్‌లైన్ మోసాలపై ఆందోళన చెందవద్దు
  3. ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి
  4. మన్‌కీబాత్‌లో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: డిజిటల్ అరెస్టులు, ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలను హెచ్చరించారు. ఈ అంశాలపై అవగాహన పెంచుకోవడం అవసరమని సూచించారు.

మన్‌కీబాత్ 115వ ఎపిసోడ్‌లో మోదీ ఆదివారం ప్రసంగిస్తూ.. ఆన్‌లైన్ స్కాములను కీలకమైన ఆందోళనగా అభివర్ణించారు. స్కామ్ ఉచ్చులో చిక్కుకున్నప్పుడు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. వీటిని ఎదుర్కొనేందుకు మూడు అంచెల విధానాన్ని పాటించాలని చెప్పారు. వేచి చూడండి, ఆలోచించండి, చర్య తీసుకోండి (వెయిట్, థింక్, టేక్ యాక్షన్) పద్ధతిని పాటించాలన్నారు. 

అప్రమత్తంగా ఉండాలి

చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే వ్యవస్థ లేదు. ఇది కేవలం ఒక ఫ్రాడ్ మాత్రమే. ఇలా చేస్తున్నవారు సమాజానికి శత్రువులు. వాళ్లను వాళ్లు పోలీసులు, సీబీఐ, ఆర్‌బీఐ లేదా నార్కొటిక్స్ అధికారులుగా పరిచయం చేసుకుంటారు. కానీ, ఏ దర్యాప్తు సంస్థ కూడా ఇలా ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా సంప్రదించదు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి బహుళ ఏజేన్సీలు రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు.

డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాన్ని ప్రభుత్వాలు ఎదుర్కోవాలి. మీరు కూడా ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితో పంచుకోవద్దు. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. కాల్ రికార్డు చేయండి అని మోదీ సూచించారు. ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ అరెస్టుల గురించి ఫిర్యాదు చేయాలనుకుంటే 1930 నేషనల్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని పేర్కొన్నారు. లేదా అధికారిక పోర్టల్ లేదా కుటుంబసభ్యులు, పోలీసులకు తెలియజేయాని చెప్పారు. 

యువత అద్భుతాలు సృష్టిస్తోంది

మన్‌కీబాత్ వేదికగా ప్రజలకు ముందుగానే ప్రధాని దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆత్మనిర్భర్ భారత్‌తో ప్రతి రంగంలోనూ అద్భుతాలు సృష్టిస్తోందని అన్నారు. కొన్నేళ్ల క్రితం భారత్‌లో ఏదైనా టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందని చెబితే నమ్మేవారు కాదని, ఇప్పుడు మన సామర్థ్యాలు చూసి ఆశ్చర్యపోతున్నారని పేర్కొన్నారు.

దేశంలో యానిమేషన్, గేమింగ్ పరిశ్రమ బాగా ఎదుగుతోందని, యువత మన సంస్కృతికి అద్దం పట్టే కంటెంట్‌ను రూపొందిస్తున్నారని ప్రశంసించారు.అక్టోబర్ 28న వరల్డ్ యానిమేషన్ డే జరపుకోనున్నామని, భారత్‌ను గ్లోబల్ యానిమేషన్ పవర్‌హౌస్‌గా మార్చేందుకు సంకల్పించాలని పిలుపునిచ్చారు.