- ‘రుణమాఫీ’ ప్రకటనతో ఇక ‘సైబర్’ గాలాలు
- మొబైల్ లింక్స్ ఓపెన్ చేస్తే ఇక అంతే సంగతులు
- రైతులు అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరిక
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 18 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించిన నేపథ్యంలో రైతులు సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని సైబ ర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూ బ్యాంక్ ఖాతాల్లో రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. మా రుతున్న సాంకేతికతకు అనుగుణంగా నేరగాళ్లు కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. అమాయకపు ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు.
ఇప్పుడు రుణమాఫీ ప్రకటన రావడంతో ఇక సైబర్ నేరగాళ్లు రైతులను టార్గెట్ చేసే అవకాశం ఉందని సైబర్ క్రైం పోలీసులు అంచనా వేస్తునానరు. నేరగాళ్ల బారిన పడి రూ.లక్ష కంటే ఎక్కువగా పోగొట్టుకుంటే సిటీ సెంట్రల్ క్రైం పోలీసు స్టేషన్, రూ.లక్ష కంటే తక్కువగా పోగట్టుకుంటే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో గంటలోపు ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైం డీసీపీ ధార కవిత సూచిస్తున్నారు.
ముఖ్య సూచనలివీ..
సైబర్ నేరగాళ్లు బ్యాంకుల పేరిట వాట్సాప్‌కు బ్యాంకు, బ్యాంకు లోగో, బ్యాంకు అధికారుల ఫొటోతో (బ్లూ కలర్)లో కొన్ని మోసపూరితమైన లింకులు, ఏపీకే ఫైల్స్ పంపిస్తారు. ఆ లింక్ ఓపెన్ చేసినా, డౌన్‌లోడ్ చేసినా మన మొబైల్ నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్తుంది. అంతేకాదు మన కాంటాక్ట్ నంబర్స్ అన్నీ వారికి తెలిసిపోతాయి. ఆ నంబర్లకు కాల్ చేసి మీ పేరిట డబ్బులు అడిగే అవకాశం ఉన్నది. ఒకవేళ అవతలి వ్యక్తి డబ్బు పంపించేందుకు సిద్ధమైతే నేరగాళ్ల తమ ఖాతా నంబర్లు చెప్పి సొమ్ము జమ చేయించుకునే అవకాశం ఉన్నది.
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్‌లో అనవసరమైన లింక్‌లు ఓపెన్ చేయొద్దని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు. ఏవైనా ఫిర్యాదులకు బాధితులు వెంటనే 1930కి కాల్ చేయాలని, లేదా www.cyber crime.gov.inలో రిపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.