మానసిక ఆరోగ్యం ప్రజలందరికీ ప్రాథమిక మానవ హక్కు. ప్రతి ఒక్కరూ, ఎవరు ఎక్కడ ఉన్నా, మానసిక ఆరోగ్యం యొక్క అత్యున్నత స్థాయిని పొందే హక్కు ఉంది. ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య పరిస్థితులు ఉన్న వ్యక్తులు అనేక రకాల మానవ హక్కుల ఉల్లంఘనలు, వివక్షకు గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎనిమిది మందిలో ఒకరు మానసిక అనారోగ్య పరిస్థితులతో జీవిస్తున్నారు.
ఇది వారి శారీరక ఆరోగ్యం, జీవనోపాధిపై ప్రభావం చూపుతుంది. అంతే కాదు చాలా మందికి అవసరమైన మానసిక ఆరోగ్య సంరక్షణను పొందలేకపోతున్నారు. ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ అనేది ప్రపంచ వ్యాప్తంగా మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్గించే అంతర్జాతీయ దినం. వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ చొరవతో 1992 నుంచీ ప్రతి ఏటా అక్టోబర్ 10న నిర్వహిస్తున్నారు.
మానసిక ఆరోగ్యం అనేది మన భావోద్వేగ, మానసిక, సామాజిక శ్రేయస్సును కలిగి ఉంటుంది. ఇది మనం ఎలా ఆలోచిస్తామో, అనుభూతి చెందుతామో, పని చేసే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది మనం ఒత్తిడిని ఎలా నిర్వహిస్తామో, ఇతరులతో ఎలా సంబంధం కలిగి ఉంటామో,ఎంపికలను ఎలా చేయాలో కూడా నిర్ణయించడంలో సహాయపడుతుంది.
బాల్యంనుండి యుక్తవయస్సు వరకు జీవితంలోని ప్రతి దశలోనూ మానసిక ఆరోగ్యం ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా మానసిక అనారోగ్య పరిస్థితులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. జనాభా మార్పుల కారణంగా గత 2017 వరకు మానసిక అనారోగ్యం పరిస్థితులు, పదార్థ వినియోగ రుగ్మతలలో 13 శాతానికి పైగా పెరుగుదల కనపడింది.
ప్రపంచంలోని ప్రతి అయిదుగురు పిల్లలలో ఒకరు మానసిక అనారోగ్యం కారణంగా బాధపడుతున్నారు. అలాగే 15-29 ఏళ్ల మధ్య వయసులో ఆత్మహత్యలు, మరణానికి రెండవ ప్రధాన కారణం. ముఖ్యంగా డిప్రెషన్, యాంగ్జైటీ, స్కిజోఫ్రీనియా, సంఘర్షణలు. మద్యం, మత్తు పదార్థాల అలవాటు వల్లనే ఎక్కువ మంది మానసిక అనారోగ్యానికి గురవుతున్నారు. మానసిక అనారోగ్యం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రతి సంవత్సరం లక్ష కోట్ల డాలర్లు ఖర్చు అవుతుంది.
ప్రతి ఒక్కరిజీవితం అనేక అనుభవాలు, సంఘటనలతో నిండి ఉంటుంది. వీటిలో కొన్ని ఒక వ్యక్తికి బాధనూ, ఒత్తిడినీ కలిగించవచ్చు. చాలామంది వీటిని తట్టుకుంటూనే బతుకును కొనసాగించడం నేర్చుకుంటారు. కాని ఒకోసారి అవి మానసిక వ్యాధులకు దారితీయవచ్చు. బాల్యంలో హింసకు, భావోద్వేగ పరమైన అశ్రద్ధకు, నిర్లక్ష్యానికి గురయిన వారు డిప్రెషన్, యాంగ్జయిటీ లాంటి మానసిక అనారోగ్యాలకు గురవుతారు.
మెదడుకు సోకే ఇన్ఫెక్షన్స్ వలన, ఎయిడ్స్, తలకు దెబ్బ తగలడం, మూర్ఛ వ్యాధి, మెదడు రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టడం, బుద్ధి మాంద్యం, డిమెన్షియా, భావోద్వేగ సమస్యలు వస్తాయి. చాలా తీవ్రమైన మానసిక వ్యాధులకు వారసత్వం అనేది అతి ముఖ్యమైన అంశం. ఐతే, తల్లిదండ్రులిద్దరిలో ఒక్కరికే మానసిక వ్యాధి ఉంటే పిల్లలకు వ్యాధి వచ్చే ప్రమాదం చాలా తక్కువ.
మధుమేహ వ్యాధి లేక డయాబెటిస్, అధిక రక్తపోటు లేక హైపర్‌టెన్షన్‌లాగానే ఈ వ్యాధులపై కూడా పరిస్థితులు, పరిసరాల ప్రభావం ఉంటుంది. మూత్రపిండాలు, కాలేయం దెబ్బతిని పని చెయ్యక పోవడం వలన తీవ్ర మానసిక వ్యాధులు రావచ్చు. మానసిక వ్యాధిగ్రస్తులపై చిన్నచూపు, దుర్విచక్షణ, మానవ హక్కుల ఉల్లంఘనలు కొనసాగడం- మరో విషాదం.
పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా 2018 నాటి సర్వే- యాంగ్జయిటీ, డిప్రెషన్, స్కిజోఫ్రెనియా లాంటి మానసిక రుగ్మతల బాధితుల్లో అత్యధికులు భారత్‌లోనే ఉన్నారన్న చేదు నిజాన్ని ఆవిష్కరించింది. భారతదేశం బడ్జెట్‌లో ఆరోగ్య సంరక్షణ కోసం తక్కువ శాతం నిధు లు కేటాయించడం చాలా బాధాకరం.
అంతర్జాతీయ కార్మిక సంస్థ గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో 112 దేశాల్లో నిర్వహించిన సర్వేలో మూడింట ఒక వంతు నిరాశలో కూరుకుపోయి ఉన్నారని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం- అమెరికాలో ప్రతి పది లక్షల మందికి 100 మంది మానసిక వైద్య నిపుణులు, 300మంది మనస్తత్వవేత్తలు ఉన్నారు.
భార త్‌లో పది లక్షల మందికి ముగ్గురు వైద్యులే ఉన్నా రు. ప్రపంచవ్యాప్తంగా వందకోట్ల మంది మానసిక రుగ్మతతో జీవిస్తున్నారు. మానసిక ఆరోగ్య పరిస్థితి తీవ్రతరం కాకముందే వైద్య నిపుణుల సంప్రదించడం మంచిదని గుర్తుంచుకోండి.
డా. బి. వి. కేశవులు