24-03-2025 12:53:47 AM
హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో కొంతకాలంగా సంచల నం రేపుతున్న బెట్టింగ్ ప్రమోషన్ల వ్యవహా రం మెల్లిగా టాలీవుడ్ స్టార్ హీరోల మెడకు చుట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ సినీనటులు ప్రభాస్, బాలకృష్ణ, గోపీచంద్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశారంటూ మారేడుపల్లికి చెందిన రామారావు అనే న్యాయవాది సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు నటులు ఫన్ 888 బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ యాప్ వల్ల ఎంతో మంది యువత డబ్బులు పోగొట్టుకున్నారని, ఈ డబ్బు మ్యూల్ ఖాతాల ద్వారా చైనాకు చేరుతుందని ఆరోపించారు. కాగా ఈ ఫిర్యాదుపై పోలీసులు స్పందించాల్సి ఉంది. ఇటీవల ప్రముఖ సినీ నటులు దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, అనన్యపై ఈనెల 19న మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే.
ఈనెల 17న పంజాగుట్ట పీఎస్‌లో ప్రముఖ యాంకర్లు విష్ణు ప్రియ, రీతూచౌదరితో పాటు మరో ౯ మంది ఇన్‌ప్ల్యూయెన్సర్లపై కేసు నమోదైంది. ప్రస్తుత ఈ రెండు కేసులపై పోలీసు విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే నమోదైన కేసులో విష్ణుప్రియ, ప్రీతి చౌదరి, టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్‌గౌడ్‌ను ఓసారి వేర్వేరుగా విచారించారు.
25న మరోసారి విచారించనున్నారు. కాగా యాంకర్ శ్యామల సోమవారం పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇదే కేసులో పలువురికి నోటీసులిచ్చారు. కానీ హర్ష సాయి, ఇమ్రాన్‌ఖాన్ పోలీసులకు అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది.