19-03-2025 12:05:19 AM
కామారెడ్డి, మార్చి 18 (విజయ క్రాంతి): విద్యార్థులు యువత వృద్ధులు సైతం బెట్టింగులకు అలవాటు పడుతున్నారు. బెట్టింగుల కు అలవాటు పడి సర్వం కోల్పోతున్నారు. చివరికి అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. యువకులు తల్లిదండ్రులకు క్షో భ పెడుతున్నారు.
ఆన్లైన్ గేమ్ లతోపాటు క్రికెట్ గేమ్ ల మోజులో పడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదిస్తామనే దురాశతో విద్యార్థులు యువకులు మహిళలు వృద్ధులు సైతం బెట్టింగులకు పాల్పడు తూ అప్పుల పాలవుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం కానుంది ఏడాది మొత్తం ఎంత బెట్టింగ్ జరుగుతుందో?...
ఒక్క ఐపీఎల్ సీజన్లోనే అంతకు మించి జరుగుతుంది. కొంతమంది బెట్టింగ్ రాయుళ్లు తమ పాత కస్టమర్లతో గ్రూపులను ఏర్పాటుచేసి మ్యాచ్ల వారీగా ఫేవరెట్ టీమ్ వంటి వివరాలను పోస్ట్ చేస్తున్నారు. కామారెడ్డి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రధాన బుకీలు 500 మంది, మినీ బుకీలు మరో వెయ్యి మంది వరకు ఉంటారని అంచనా.
పేమెంట్ సులభం..
బెట్టింగ్ కాయాలనుకునే వాళ్లు..బుకీలకు ముందుగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో అకౌంట్లో జమ చేసిన తరువాత బెట్టింగ్కు అవకాశం కలిగేది. కానీ, ప్రస్తుతం బుకీలకు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా అమౌంట్ పంపిస్తే సరిపోతుంది. ఒకవేళ బెట్టింగ్ కాసిన వ్యక్తి గెలిస్తే...ఆ మొత్తాన్ని తరువాత రోజు ఉదయం డిపాజిట్ చేస్తారు.
బాలు..రన్ కు..వికెట్ కు
గతంలో బెట్టింగ్ అంటే మ్యాచ్కు పరిమితమై ఉండేది. ఆ మ్యాచ్లో ఎవరు గెలిస్తారనే దానిమీదే ఎక్కువ బెట్టింగ్ జరిగేది. అయితే, గత కొన్నేళ్లుగా బెట్టింగ్లో భారీమార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతి బాల్కు బెట్టింగ్ కాస్తుంటారు. ఈ బాల్ కు వికెట్ పడుతుందా?, రన్ వస్తుందా?, డాట్ పడుతుందా..?...అన్న దానిపై కూడా బెట్టింగ్ నిర్వహిస్తారు.
పది వేలు డిపాజిట్..
బుకీలు, మినీ బుకీలుగా రెండు రకాలు వ్యక్తులుంటారు. మెయిన్ బుకీ వద్ద బెట్టింగ్ కాయాలంటే కనీసం పది వేలు రూపాయలు డిపాజిట్ చేయాలి. మినీ బుకీలు చిన్న చిన్న బెట్టింగ్లు నిర్వహిస్తుంటారు. మెయిన్ బుకీ పక్కన వుండే కొందరు మినీ బుకీలుగా వ్యవహరిస్తుంటారు. వీరి వద్ద రెండు వేల రూపాయలు డిపాజిట్ చేసి బెట్టింగ్ కాసేందుకు అవకాశముంది. ఇకపోతే, బెట్టింగ్ నిర్వాహకులలో ఎక్కువ మంది వడ్డీ వ్యాపారులే ఉంటున్నారు. వీరు తమకు తెలిసిన యువకులకు అప్పులు ఇచ్చి ఈ ఉచ్చులోకి లాగుతుంటారు. వీరికి కొందరు మహిళలు పూర్తి సహకారాన్ని అందిస్తుంటారు.
ఆన్లైన్ యాప్ లు
ముఠాలు నిర్వహించే బెట్టింగ్ ఒక ఎత్తుతై..కొన్ని ఆన్లైన్ యాప్లు కూడా బెట్టింగ్కు అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ప్రముఖ యాప్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ యాప్ల ను బెట్టి్ంప పూర్తిస్థాయిలో అవగాహన ఉన్న వాళ్లు మాత్రమే వినియోగిస్తుంటారు. ఈ యాప్లు వినియోగించే వాళ్లకు.. బుకీలతో పని లేదు. ఇందులో రెండో వ్యక్తి ప్రమేయం ఉండదు. ఈ తరహా యాప్లను కొంచెం ఉన్నత ఉద్యోగాలు చేసే వ్యక్తులు వినియోగిస్తుంటారు. ఈ యాప్ల నిర్వాహకులు బెట్టింగ్ కాసే దాంట్లో కొంత మొత్తాన్ని కమీషన్ రూపంలో తీసుకుంటుంటారు.
బెట్టింగ్ తో యువత బలి
బెట్టింగ్ ఉచ్చులో యువకులు చిక్కుకుంటున్నారు. ఒకప్పుడు బెట్టింగ్ అతికొద్దిమం దికి మాత్రమే సంబంధించిన వ్యవహారంగా మాత్రమే ఉండేది. ప్రస్తుతం ఈ ఉచ్చులో చిక్కుకోని వాళ్లంటూ లేరంటే అతిశయోక్తి కాదేమో. ఈ బెట్టింగ్ జాఢ్యం గ్రామాలకు కూడా పాకేసింది. మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు నుంచే కుర్రాళ్లు.. గ్రూపులుగా ఏర్పడి తమకు నచ్చిన ట్పీ బెట్టింగ్ కాస్తున్నారు.
ముందు రూ.100, రూ.200తో నుంచి ప్రారంభించి...క్రమంగా వేల రూపాయలు కాసే స్థితికి వెళ్లిపోతున్నారు. బెట్టింగ్లో పోగొట్టుకున్న డబ్బును ఎలాగైనా తిరిగి గెలుచుకోవాలన్న ఉద్దేశంతో...అప్పులు చేయడంతో పాటు ఇంట్లో దొంగతనాలకు కూడా పాల్పడుతున్నారు.
ఇటీవల కామారెడ్డి జిల్లాలో 12 మంది యువకులు ఆన్లైన్ యాప్ లో ఆటలు ఆడి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. వెలుగులోనికి రానివారు మ రేందరో ఉన్నారు. ఎంతో విలువైన ప్రాణాన్ని అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటూ కుటుంబ సభ్యులకు కన్న తల్లిదండ్రులకు క్షోభను మిగులుస్తున్నారు.
బెట్టింగ్ జోలికి వద్దు వంద, వెయ్యితో ప్రారంభమయ్యే బెట్టింగ్...తరువాత వేలల్లోకి వెళుతోంది.
అందుకోసం చేసిన అప్పులు తీర్చలేక కొంతమంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. జూదం వల్ల బాగుపడిన వాళ్లు ఎవరూ లేరన్న విషయాన్ని గుర్తించుకోవాలని, క్రికెట్ మ్యాచ్లను ఆనందం కోసం మాత్రమే వీక్షించాలి తప్ప..జూదం కోసం కాదని పలువురు సూచిస్తున్నారు. ఈ ఐపీఎల్ సమయంలో కుటుంబ సభ్యులు అప్రమత్తంగా వుండాలని, పిల్లలను వీలైనంత వరకు ఇంట్లోనే వుండేలా చూడాలని చెబుతున్నారు.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ బెట్టింగ్ ఐపీఎల్ బెట్టింగ్ ల నిర్వాహకులపై పోలీసులు గట్టిగా దృష్టి పెట్టి అవగాహన సదస్సులు కలిగిపించి కఠిన చర్యలతో ఉక్కు పాదం మోపాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఇటీవల జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ రాజీవ్ చంద్ర దృష్టి సారించి ఐపీఎల్ బెట్టింగులు యాప్ బెట్టింగ్లపై ఉక్కు పాదం మోపాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
కామారెడ్డి జిల్లాలో జుక్కల్ బాన్సువాడ ఎల్లారెడ్డి కామారెడ్డి పట్టణ కేంద్రాలు నియోజకవర్గాల్లో మండల కేంద్రాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఐపీఎల్ ఆన్లైన్ యాప్ ల ద్వారా బెట్టింగ్ లా జోరు కొనసాగుతున్నాయి. పోలీస్ ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే ఆన్లైన్ ఐపీఎల్ బెట్టింగ్ లను అణచి వేయడానికి ఆస్కారం ఉంటుందని జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు.