08-04-2025 12:23:44 AM
అత్యాశకు పోయి నష్టపోతున్న యువకులు
ఇప్పటికే పది మంది అరెస్ట్
మరో 11 మంది గుర్తింపు
ఇటీవల కిస్మత్‌పూర్‌లో నలుగురు అరెస్టు
బెట్టింగ్‌ను అణచివేస్తాం: ఏసీపీ శ్రీనివాస్
రాజేంద్రనగర్, ఏప్రిల్ 7: బెట్టింగ్ భూ తం చాపకింది నీరులా శరవేగంగా విస్తరిస్తుంది. అత్యాశకు పోయి అమాయకులైన యువకులు దీని బారినపడి లక్షల్లో నష్టపోతున్నారు. ఐపీఎల్ సీజన్ జరుగుతున్న నేప థ్యంలో యువకులు బెట్టింగ్ భూతానికి ఆకర్షణతులవుతున్నారు. సులభంగా డబ్బు వ స్తుందని నమ్మి ఎంతోమంది నష్టపోతున్నారు. లక్షల్లో పోగొట్టుకొని చివరికి కొన్ని సందర్భాల్లో తనువు చాలిస్తున్న ఉదంతాలు కూడా లేకపోలేదు.
ఇటీవల రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిస్మత్పూర్ గ్రా మంలో ఆన్ లైన్ బెట్టింగ్ ఆడుతున్న నలుగురు యువకులను పోలీసులు గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు. వారి ఖాతాలో రూ.38 వేలను గుర్తించారు..
ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో బెట్టింగ్ ఆడుతున్న పదిమందిని ఎస్ ఓ టీ పోలీసులు అరెస్టు చేశారు. మరో 11మంది బె ట్టింగ్ ఆడుతున్నట్లు గుర్తించారు. ఐపియల్ సీజన్ జోరుగా నడుస్తున్న నేపథ్యంలో యు వకులు దీని బారిన పడుతున్నారు. ముం బైలో ఉంటున్న ప్రధాన బుకి పలువురు సబ్ ఏజెంట్లను నియమించుకొని ’ఆట’ ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
75 లక్షలు పోగొట్టుకున్న యువకుడు
ఆన్లైన్ బెట్టింగ్ భూతానికి బానిస అయిన ఓ యువకుడు 75 లక్షలు ఇప్పటికే పోగొట్టుకున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలిసింది. మొయినాబాద్ మండలం లోని ఓ గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే యువకుడు ఏడాది కాలం లో తన బ్యాంకు అకౌంట్ ద్వారా సుమారు కోటిన్నరకు పైగా లావాదేవీలు నిర్వహించడం గమనార్హం.
అతడు సుమారు 75 లక్ష లు నష్టపోయాడు. సులభంగా డబ్బు సాధించవచ్చనే అత్యాశకు పోతున్న బాలురు, విద్యార్థులు, యువకులు ఆన్లైన్ బెట్టింగ్ కు బానిస అవుతూ ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో కుటుంబాలు రోడ్డున పడటంతో చేసేది ఏమీ లేక చివరకు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఉదంతాలు కూడా తరచూ కనిపిస్తూనే ఉన్నాయి.
అంతటా విస్తరిస్తున్న భూతం
సీజన్ నడుస్తున్న నేపథ్యంలో ఆన్లైన్ బెట్టింగ్ భూతం అంతటా విస్తరిస్తుంది. గ్రా మాలు, పట్టణాలు తేడా లేకుండా అత్యధిక వేగంగా విస్తరిస్తుంది. సులభంగా డబ్బులు సాధించాలని అత్యాశకు పోతున్న జనం అంతే వేగంగా నష్టపోతున్నారు. రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్ డిసిపిల పరిధిలో బెట్టింగ్ జోరుగా సాగుతున్నట్లు తెలుస్తుంది. క్షేత్రస్థాయిలో పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి బెట్టింగ్ భూతాన్ని పెకిలించి వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఉక్కు పాదం మోపుతాం
బెట్టింగ్ పై ఉక్కు పాదం మోపుతాం. యువకులు ఈజీగా డబ్బులు సంపాదించవచ్చని మోజులో పడి ఆన్లైన్ బెట్టింగుకు బానిస అవుతున్నారు. దీనికి బానిస సాయి జీవితాలను నాశనం చేసుకోవద్దు. బెట్టింగ్ నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. బెట్టింగ్ వ్యవహారంలో ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది.
శ్రీనివాస్, రాజేంద్రనగర్ ఏసిపి