calender_icon.png 22 April, 2025 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెట్టింగ్.. కిల్స్!

22-04-2025 02:02:42 AM

  1. ఈజీ మనీకి ఆశపడి.. అప్పుల ఊబిలో కూరుకుని.. 
  2. రాష్ట్రంలో ఒక్క నెలలోనే ఏడు మరణాలు
  3. మృతులందరి వయసూ 26 ఏళ్లలోపే..
  4. కన్నవారికి మిగిలిన కడుపుకోత

హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాం తి): తెలంగాణలో ఆన్‌లైన్ బెట్టింగ్ భూతం జడలు విప్పుతున్నది. నిర్దాక్షిణ్యంగా యువ త ప్రాణాలను బలిగొంటున్నది. కన్నవారికి కడుపు కోత మిగులుస్తున్నది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. కేవలం ఒక్క ఈ నెలలోనే రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు యువకులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రాణం తీసుకు న్న ప్రతి యువకుడి వయస్సు 26 ఏళ్లలోపే కావడం గమనార్హం.

ఈజీ మనీకి ఆకర్షితులై యువత అప్పులు చేసి మరీ బెట్టింగ్‌లోకి దిగుతున్నారు. ఒకేసారి లక్షలాధికారులు అయిపోవచ్చని బుక్కర్లు వేసిన గాలాలకు యువకులు చిక్కుకుంటున్నారు. వారి మాటలకు ఆకర్షితులై అప్పో..సప్పో చేసి బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. ఇవాళ పోతే రేపన్నా.. డబ్బులు చేతికి వస్తాయనే భ్రమలో అదే ఊబిలో కూరుకుపోతున్నారు. ఇటీవల బలవన్మరణాల వెనుక విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చాయి.

జేఎన్‌టీయూహెచ్‌లో ఎంటెక్ చదువుతున్న విద్యార్థి ఐపీఎల్ బెట్టింగ్ పెట్టి రూ.2.65 లక్షలు పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రులకు ఏం చెప్పాలో తెలియక తనువు చాలించాడు. అలాగే సోమేశ్ అనే విద్యార్థి రూ.2 లక్షలు, నిజామాబాద్‌కు చెందిన 22 ఏళ్ల ఆకాశ్ రూ.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

ఇలా ఈ నెలలో ఏడుగురు బెట్టింగ్‌కు బలయ్యారు. ఈ ఏడుగురు బెట్టింగ్‌లు పెట్టి సుమారు రూ.20 లక్షల వరకు పోగొట్టుకున్నట్లు పోలీసులు అంచనా వేశారు. మృతుల్లో ఆరుగురు యువకులు అక్కడా ఇక్కడ అప్పులు చేసే బెట్టింగ్‌లు పెట్టి, మొత్తం పోగొట్టుకున్నారని గుర్తించారు.

‘సిట్’ ఏర్పాటు..

రాష్ట్రంలో బెట్టింగ్ ముఠా ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు సర్కార్ ఇటీవల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. మరోవైపు ఇప్పటికే అనేక ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై నిషేధం విధించింది. కానీ.. బెట్టింగ్‌రాయుళ్ల అధునాతన సాంకేతికతను వినియోగించుకుని, బెట్టింగ్ యాప్‌లు తెరుస్తున్నట్లు సిట్ గుర్తించింది. ఈ యాప్‌ల్లో చైనాకు చెందినవి కూడా ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 70 ఆన్‌లైన్ బెట్టింగ్‌కు సంబంధించిన కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసుల్లో విచారణ వేగవంతమైంది.

సైట్ల నిషేధం, బ్యాంకు అకౌంట్లు సీజ్...

బెట్టింగ్, గ్యాంబ్లింగ్ రాష్ట్రాల పరిధిలోని అంశాలని, వాటిపై ఆయా రాష్ట్రప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు చేసుకోవచ్చని ఇటీవల కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఒకవైపు రాష్ట్రప్రభుత్వాలకు సూచనలిస్తూనే, మరోవైపు కేంద్రం ఇప్పటివరకు 1,410 గేమింగ్ సైట్లను బ్లాక్ చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని డీజీజీఐ బెట్టింగ్‌కు సంబంధించిన వందల వెబ్‌సైట్లను క్లోజ్ చేసింది. 2,400 బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసి, రూ.126 కోట్లను ఫ్రీజ్ చేసింది. గేమింగ్ ప్లాట్‌ఫాంల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.