25-03-2025 12:58:21 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, శేరిలింగంపల్లి, మార్చి 24 (విజయక్రాంతి): బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. ఈ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. దర్యాప్తును వేగవంతం చేశారు. కేసులో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకున్నది.
తెలంగాణ పోలీసులు జిగిల్ రమ్మీ డాట్ కామ్, ఏ 23, యోలో 247, ఫెయిర్ ప్లే, జీత్ విన్, వి బుక్, తాజ్ 77, వివి బుక్, ధని బుక్365, మామ 247, తెలుగు 365, ఎస్ 365, జై 365, జెట్ ఎక్స్, పరి మ్యాచ్, తాజ్ 777 బుక్, ఆంధ్రా 365 వంటి మొత్తం 19 యాప్స్ నిర్వాహకులనూ నిందితుల జాబితాలో చేర్చినట్లు తెలిసింది.
పోలీసులు ఇప్పటికే బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, అనన్య నాగళ్ల తదితర సెలబ్రెటీలను సాక్షులుగా మార్చాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 19న సినీనటులు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లతో కలిపి మొత్తం 25 మంది కేసులు నమోదయ్యాయి.
మరోవైపు పంజాగుట్ల పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 17న నమోదైన కేసులో ఇప్పటికే విష్ణుప్రియ, టేస్టీ తేజ, రీతూ చౌదరి, కానిస్టేబుల్ కిరణ్, యాంకర్ శ్యామల వంటి ఇన్‌ఫ్లూయెన్సర్లు విచారణకు హాజరు కాగా, మరికొందరు విచారణకు హాజరు కావాల్సిఉంది. కీలక నిందితులైన హర్షసాయి, ఇమ్రాన్ ఖాన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
విచారణకు సహకరిస్తా: యాంకర్ శ్యామల
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు విచారణకు తాను పోలీసులకు సహకరిస్తానని యాంకర్ శ్యామల పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. తన అడ్వొకేట్‌తో కలిసి విచారణకు హాజరయ్యారు. పోలీసులు ఆమెను సుమారు మూడు గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు విచారణలో ఉందని, ప్రస్తుతానికి ఆ కేసు విషయమై స్పందించలేనన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ తప్పు అని తెలుసుకున్నానని వెల్లడించారు. యాప్స్‌లో బెట్టింగ్ పెట్టి నష్టపోయి ఉంటే, అందుకు తాను చింతిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఇకపై తాను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయనని తెలిపారు.