21-01-2025 11:57:49 PM
రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్...
ముషీరాబాద్ (విజయక్రాంతి): త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుల ఆమోదంలో కార్మికులకు మెరుగైన వేతనాలు పెరగబోతున్నాయని తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని కార్మిక శాఖా భవన్‌లో రాష్ట్ర కనీస వేతన సలహా మండలి రెండవ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ జనక్ ప్రసాద్ మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో రూ. 1. 25 కోట్ల మందికి మెరుగైన వేతనాలు అందించడం కోసం ప్రత్యేక శ్రద్ద వహించి ఈ బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కార్మికుల వేతనాలు పెంచడం కోసం అనేక రకాల పరిశోధన అధ్యయనం చేయడం జరుగుతుందని, కార్మికులకు వారి జీవనానికి ఆమోదయోగ్యమైన మెరుగైన వేతన పెంపు జరగబోతుందని తెలిపారు. త్వరలోనే కార్మికులకు మెరుగైన వేతనాలు అందబోతున్నాయని అన్నారు. ఈ సమావేశంలో బోర్డు సెక్రెటరీ శ్యాం సుందర్ రాజు, నరసింహారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, యూసప్, రాజు ముదిరాజ్, మీలా జయదేవ్, బాసాని చంద్రప్రకాష్, ప్రొఫెసర్ సి. రవి, బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.