calender_icon.png 11 January, 2025 | 1:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కశ్మీర్‌లో మెరుగైన ఫలితాలు

12-10-2024 02:10:35 AM

  1. ఓడిన ప్రతిఒక్కరూ ఈవీఎంల మీదే నిందలు మోపుతారు
  2. మూసీ సుందరీకరణకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారు
  3. చిట్‌చాట్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో బీజేపీకి గతం కంటే మెరుగైన ఫలితాలు వచ్చాయని, ఈ విషయమై తాము సంతోషంగా ఉన్నామని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి, బీజేపీ కశ్మీర్ ఎన్నికల ఇన్‌చార్జి జీ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జమ్మూ రీజియన్‌లో 43 స్థానాల్లో తాము 29 స్థానాలను కైవసం చేసుకున్నామన్నారు.

పలు అంశాలపై శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. కశ్మీర్‌లో అధికారం చేపట్టబోతున్న ఎన్‌సీకి 23 శాతం ఓట్లొస్తే తమకు 25 శాతం ఓటింగ్ నమోదైందని, వారు అధిక సీట్లతో అధికారానికి చేరువయ్యారని తెలిపారు. స్వాతంత్య్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఒక్క హింసాత్మక ఘటన లేకుండా జరిగిన ఎన్నికలు ఇవేనన్నారు.

హర్యానాలో ఈవీఎంలను నిందిస్తున్న కాంగ్రెస్ పార్టీ జమ్మూకశ్మీర్ విషయంలో ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలన్నారు. ఓడిన ప్రతిఒక్కరూ ఈవీఎంలను నిందించడం అలవాటైపోయిందని విమర్శించారు. జమ్ముకశ్మీర్‌లో ఏ ప్రభుత్వం ఉన్నా శాంతిభద్రతల విషయంలో బీజేపీ సర్కార్ రాజీ పడదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ డిమాండ్ చేయడం మామూలు విషయమేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఆర్టికల్ 370 మాటే ఉండదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

అన్నీ మీరే ఇచ్చి కూల్చేస్తారా..

రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కరెంట్, మంచినీటి నల్లా, రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు ఇలా అన్ని సౌకర్యాలు ప్రభుత్వమే సమకూర్చి ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరుతో ప్రజల ఇండ్లను కూల్చేస్తారా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సుందరీకరణ పేరిట కూలగొట్టిన తర్వాత ఆ ప్రాజె క్టు ప్రారంభం కాకుంటే కూలిపోయిన ఇండ్లకు బాధ్యులెవరని అన్నారు.

సుందరీకరణ కోసం రూ. 1.50 లక్షల కోట్ల బడ్జెట్‌ను ఎలా సమకూరుస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. సచివాలయంలో చర్చ కాదు.. మూసీ బస్తీల్లో చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మూసీ సుందరీకరణ కోసం రిటెయినింగ్ వాల్ కడితే సరిపోతుందని, కూల్చివేతలు అవసరం లేదని అన్నారు.