26-04-2025 12:34:41 AM
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
జగిత్యాల, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): పలు ఆరోగ్య సమస్యలతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రిలో త్రాగు నీటి సమస్య పరిష్కారానికై బీఆర్‌ఏస్ పార్టీ ఎంపీ సురేష్ రెడ్డి మంజూరు చేసిన రూ. 2 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంటును ఎమ్మెల్యే సంజయ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ ప్లాంట్ ఏర్పాటు మూలంగా చాలా కాలంగా ఆసుపత్రిలో నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించినట్లయింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మరిన్ని మెరుగైన వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఆసుపత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో సిబ్బందిని, అవసరమైన పరికరాలను అందించాలని ఆరోగ్య శాఖ మంత్రికి మీడియా ముఖంగా వినతి చేశారు. ఆసుపత్రిలో వసతులు, వనరులు విషయంగా వైద్యులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి సునీతతో పాటూ పలువురు వైద్యులు, బీఆర్‌ఎస్ నాయకులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.