12-04-2025 06:23:49 PM
మూతపడిన ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించాలి..
AAS ఆజాద్ అధికార్ సేన పార్టీ జిల్లా ఇంచార్జ్ ప్రేమ్ దయాళ్..
భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి ప్రధాన ఆసుపత్రి CMO చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆజాద్ అధికార్ సేన పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంచార్జ్ బోడికల ప్రేమ్ దయాళ్. ఇందులో భాగంగా పలు అంశాలపై ప్రస్తావించగా సానుకూలంగా స్పందించిన CMO అమలు దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెడికల్ బోర్డు నిర్వహణ పారదర్శకంగా నిర్వహించి మెడికల్ బోర్డ్ లో కార్మికులకు నష్టం వాటిల్ల కుండా న్యాయం చేయాలని అన్నారు.
సింగరేణి వ్యాప్తంగా పూర్తి స్థాయిలో వైద్యులను, వైద్య సిబ్బందిని నియమించి సిబ్బందికి పని భారం తగ్గించాలని, వైద్యానికి అనుగుణంగా అవసరమైన వైద్య పరికరాలను కొనుగోలు చేయాలని చెప్పారు. మందుల కొరత లేకుండా పూర్తి స్థాయిలో అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, సంస్థలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు పూర్తి స్థాయిలో ఉచిత వైద్యం అందించాలని కోరారు. మూతపడిన ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించాలని, చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యంతో పాటు పౌష్టికాహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.