17-02-2025 10:31:29 PM
టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్..
మెదక్ (విజయక్రాంతి): ప్రభుత్వ వసతి గృహాలలో ఉన్నతమైన సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ విద్యార్థులకు సూచించారు. సోమవారం స్థానిక టీఎన్జీవో భవన్లో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు జిల్లా అధికారి శశికళ ఏర్పాటుచేసిన ప్రేరణ తరగతుల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఇష్టపడి చదవాలన్నారు. హాస్టల్లో ఉండే విద్యార్థుల కోసం ప్రత్యేక స్టడీ హవర్స్, ప్రత్యేక టూటర్స్ లను నియమించి అనుభవంగల నిపుణులతో ప్రేరణ తరగతులు నిర్వహిస్తున్నారని తెలిపారు.
పదవ తరగతి విద్యార్థుల జీవితానికి తొలి మైలురాయని దానిని అధిగమించే దిశగా అడుగులు వేయాలన్నారు. జిల్లా అధికారి శశికళ మాట్లాడుతూ... విద్యార్థులు పట్టుదలతో చదివి మెరుగైన ఉత్తీర్ణత సాధించాలని కోరారు. అనంతరం జిల్లా కార్యదర్శి మినికే రాజ్ కుమార్ తో కలిసి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, వాటర్ బాటిల్స్, తదితర స్టడీ మెటీరియల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు శేషాచారి, ఏఎస్ డబ్ల్యూఓలు లింగేశ్వర్, పద్మజ, విషయ నిష్ణాతులు సత్య నారాయణ రెడ్డి సంక్షేమ అధికారులు తులసి రామ్, విక్రమ్, స్వామి, నవీన్, మహేందర్ రెడ్డి, శాంతాబాయి పాల్గొన్నారు.