ఎమ్మెల్యే కాలె తీరుపై మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ధ్వజం
హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): రాజకీయ విలువలతో బతుకుతానని చెప్పిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య చివరకు నమ్ముకున్న కార్యకర్తలకు ద్రోహం చేశారని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన యాదయ్యకు పదేండ్లు దేవుడిలా కనిపించిన కేసీఆర్ ఇప్పుడు దయ్యంగా మారాడా అని నిలదీశారు. బీఆర్‌ఎస్ పనైపోయిందంటున్న నేతల్లో కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు పన్నుతారనే భయం పట్టుకుందని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరుతామన్నారు. తెలంగాణలో కేసీఆర్ గుర్తులు చెరిపివేయడం సీఎం రేవంత్‌రెడ్డి తరంకాదన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల ప్రారంభోత్సవానికి వెళ్లే సీఎంకు గాంధీ, ఉస్మానియా దవాఖాన్లు కనిపించడం లేదా ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానని మాట్లాడే వారితో ఏమీ కాదని, చేవెళ్ల నియోజకవర్గ కార్యకర్తలు అధైర్య పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.