calender_icon.png 7 February, 2025 | 9:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవుడి చాటున జూదపు వేటు..!

07-02-2025 06:47:56 PM

నాగర్ కర్నూల్ జిల్లాలో జోరుగా కోడిపందాలు..

అంతర్రాష్ట్ర పందెం కోళ్ళదే ప్రాధాన్యత..

దేవుడి జాతరలో చేతులు మారుతున్న కోట్ల రూపాయలు..

ఏరులై పారుతున్న మద్యం..

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలో దేవుడి పేరుతో నిర్వహించిన కోళ్ల పందాలు కోట్లు గుమ్మరిస్తున్నాయి. ఆంధ్ర కోనసీమ ప్రాంతంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కోళ్ల పందెం మాదిరిగా నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం పెద్దపల్లి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్ర ప్రాంత నిర్వాహకులు కోళ్ల పందెం స్థావరాలను ఏర్పాటు చేశారు. అంతర్రాష్ట్ర పందెం కోళ్లతో ఒక్కో పందెంలో కోట్లు గుమ్మరిస్తున్నారు. కోళ్ల పందాలను చూస్తున్న వారు కూడా పందాలు ఆడుతూ వారి జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నారు. తెలంగాణ ఆంధ్ర కర్ణాటక వంటి ప్రాంతాల నుంచి పందెం కోళ్లను ఏసీ బస్సుల్లో తరలించారు.

దేవుడి జాతర పేరుతో కోళ్ల పందాలతో పాటు ఇతర జూదాలు కూడా నిబంధనలకు విరుద్ధంగా ఇస్టారితిగా నడుపుతున్నారు. అధికార పార్టీలోని ప్రధాన నాయకుడి అండదండలతో ఈ కోళ్ల పందెం స్థావరాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి గ్రామంలో వెంకట బుగ్గ నరసింహ స్వామి జాతర పేరుతో భారీ ఎత్తున టెంట్లు, కంచెలను ఏర్పాటు చేసి కోళ్ల పందెం స్థావరాన్ని నడిపిస్తున్నారు. ఇదంతా పోలీసు ఉన్నతాధికారులకు తెలిసే జరుగుతోందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఒక్కో కోడి పందెంలో కోట్లు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. కోడిపందాలతో పాటే నక్కి దువ్వ వంటి ఇతర జూదం ఆటలు నడిపిస్తున్నారు. దీంతో జిల్లా కేంద్రంలోని అన్ని లాడ్జిల్లో పందెం రాయుళ్లతోనే నిండిపోవడం విశేషం. దీంతో పెద్ద ఎత్తున జూదం రాయుల్ల కోసం  జాతరలో అనధికారిక మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేశారు. దీంతో జాతరలో మద్యం ఏరులై పారుతుంది. అయినా పోలీసు ఎక్సైజ్ శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.