calender_icon.png 5 February, 2025 | 2:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆత్మీయ నేస్తం

07-12-2024 12:56:39 AM

మనుషులను ఏ బంధం ఎప్పుడు కలుపుతుందో ఎవరికీ తెలియదు. ఎలాంటి రక్త సంబంధం లేని వారిమధ్య సైతం కాలం అసాధారణ అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. గత కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన ఒక ఒక సంఘటన నా దృష్టిలో ఎంత చిన్నదో ఆయన దృక్పథంలో అంత పెద్దది. ఆయన పేరు వావిలాల సత్యనారాయణ శాస్త్రి. వయసులో నాకంటే పెద్ద. అయినా, తోడబుట్టిన వారివలె మా నడుమ అంతటి ఆత్మీయతే పెనవేసుకు పోయింది. శాస్త్రి ఈంటే నాకెంతో ఆదర్శం.

1974వ సంవత్సరం. ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’ ప్రాచ్య కళాశాలలో బీఓఎల్ ఫైనల్ చదువుతున్నాను. అది సాయం కళాశాల కనుక పగలు పండిత శిక్షణ కళాశాల నడిచేది. అందులో తెలుగు పండిత శిక్షణను పొందే అవకాశం నాకు లభించింది. ఆ సంవత్సరం ప్రభుత్వం పరిషత్తు వారికి సుమారు 400 మంది విద్యార్థులకు శిక్షణావకాశం కల్పించింది. అందులో నేను ఒకణ్ణి. శిక్షణా కాలం  ఆరు మాసాలే. పరీక్షలో ఉత్తీర్ణుడనైతే తెలుగు పండితునిగా ఉద్యోగం ఖాయం.

అయితే, ఆ పరీక్షలో ఎందరు పాల్గొన్నా 10 శాతం నుంచి 15 శాతం వరకు మాత్రమే ఉత్తీర్ణులయ్యే వారు. వావిలాల సత్యనారాయణ శాస్త్రి నాకంటే ముందు అందులో శిక్షణ పొందారు. ఆయనది ఒంగోలు జిల్లా అమ్మనబ్రోలు గ్రామం. నాకంటే ఆయన పదేళ్లు పెద్దవారు. నాకంటే ముందు శిక్షణ పొందినప్పటికీ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోయారు. అందువల్ల నాతోపాటు పరీక్షకు హాజరయ్యారు. అదే అనుకోకుండా మామధ్య స్నేహబంధాన్ని ఏర్పరిచింది.

మొదటి రోజు మొదటి పేపరు టీచింగ్ మెథడాలజీ. బాగా రాశాను. పరీక్ష రాసిన తర్వాత పరీక్షా కేంద్రం బయట తోటి విద్యార్థులతో కలిసి మాట్లాడుతున్నాను. విద్యార్థులమంతా ఒక్కచోట చేరి, “నువ్వెట్లా రాశావు” అంటే “నువ్వెట్లా రాశావు” అని ఒకరినొకరం ప్రశ్నించుకుంటూ, సమాధాన పడుతున్నాం. అదే సమయంలో మాతోపాటు పరీక్ష రాసిన సత్యనారాయణ శాస్త్రి నా దగ్గరికి వచ్చి  “తమ్ముడూ, నువ్వు చెప్తుంటే విన్నాను, పరీక్ష బాగా రాశావని. రేపటి పేపరు లెసన్ ప్లాన్‌కు సంబంధించింది.

నాకు కొంచెం కష్టంగా ఉంది. నా భయం పోగొడతావా?” అని అడిగాను. “దానికేం, తప్పకుండా” అని ఉత్సాహంగా చెప్పాను. నా మాటల్ని విశ్వసించిన శాస్త్రి వెంటనే నన్ను గౌలిగూడలోని నా రూముకు తీసుకొని వచ్చాడు. బస్సులో రావలసిన వాణ్ణి ఆటోలో రావడం నాకే అబ్బురం అనిపించింది. శాస్త్రి ఆ రోజంతా నాతోనే ఉన్నారు. నాతోనే తిని, నాతోనే గదిలో విశ్రాంతి తీసుకున్నారు. 

మర్నాడు ఇద్దరం పరీక్ష కేంద్రానికి చేరుకొని పరీక్ష రాశాం. ఇద్దరం బాగానే రాశాం. ‘నాకు భయం లేదు కాని, శాస్త్రికే కొంచెం భయం. ఎందుకంటే, ఈ రెండవ సారైనా ఉత్తీర్ణుడు కాకపోతే తన ఉద్యోగం పర్మినెంటు కాదు. పదేళ్లుగా టెంపరరీగా చేయడం ఎవరికైనా కష్టమే కదా’. ఇలాంటి తాత్కాలిక స్నేహాలు అక్కడి వరకే వచ్చి ఆగిపోతాయి. కానీ, చిత్రంగా శాస్త్రి నన్ను పరీక్ష పూర్తయ్యాక కూడా వదల్లేదు. నేను ఆయనకు చేసిన సహాయం ఏమీ లేదు, ధైర్యమిచ్చాను అంతే.

ఇద్దరం సరాసరి గౌలిగూడ బస్‌స్టాండుకు ఆటోలో వచ్చాం. హోటల్లో ఇద్దరం కలిసి భోజనం చేశాం. నిజంగా శాస్త్రిగా ఎంతో సరళ స్వభావి. చెబితే ఇప్పుడు ఎవరూ నమ్మరేమో కానీ, ఆయన నాచేతిలో ఓ అన్నం ముద్ద పెట్టి తినమని అన్నప్పుడు నాకు మా చిన్నన్నే గుర్తుకు వచ్చాడు. అందుకే, ఆయణ్ని ఇప్పటికీ “అన్నయ్యా!” అని పిలువకుండా ఉండలేకపోతున్నాను. తానుకూడా నన్ను నోటినిండా “తమ్ముడూ” అనే పిలుస్తాడు. కథ ఇక్కడితోకూడా ఆగిపోలేదు.

ఇంత గొప్ప స్నేహితులు ఉంటారా?

పరీక్షలు రాసిన నాలుగు నెలలకు ఫలితాలు వచ్చాయి. నాకు ఆ విషయం తెలియ దు. మా వూరికి నా పేర వచ్చిన కార్డు ముక్క ను చదివి ఆనందంతో ఎగిరి గంతేశాను. అది శాస్త్రి రాసిన ఉత్తరం. అందులో ఇద్దరం ఉత్తీర్ణులమైనామని ఉంది. ఆశ్చర్యకరంగా మరో విషయమూ అందులో ఉంది. “తాను పరీక్షలో పాసైతే నన్ను తిరుపతికి తీసుకొని వెళ్తానని, మొదటిసారి ఆంధ్ర ప్రాంతాన్ని చూపు తానని” ఆ ఏడుకొండల తాను మొక్కిన విష యం కూడా ప్రస్తావించారు.

నన్ను బయల్దేరి రమ్మన్నారు. నమ్మలేక పోయాను. ‘ఇంత గొప్ప స్నేహితులు కూడా ఉంటారా!’ అనిపించింది. నాకెంతో ఆనందమైంది. “తప్ప కుండా వస్తాను” అని బదులు లేఖ రాశాను శాస్త్రికి. నేను వాళ్ల ఊరు ఎలా రావాలో కూ డా పూసగుచ్చినట్లు ఆ ఉత్తరంలోనే రాశారు. ముందు హైదరాబాదులో రైలు ఎక్కి ఎట్లా ఒంగోలులో దిగాలి. తర్వాత వాళ్లూరు అమ్మనుబ్రోలుకు రావాలని రాశారు. “కేవలం ఒక్క 20 రూపాయలు మాత్రమే తీసుకొని, ఫలాని తేదీనాడు రావాలని, నీ కోసం ఎదురు చూస్తుంంటానని” చాలా సవివరంగా మరో ఉత్తరం కూడా రాశారు. 

విషయాన్ని మా నాన్నకు చెబితే, “అమ్మో ఎన్నడూ రైలెక్కని వాడివి. అదీ అంత దూర ఆంధ్ర ప్రాంతం. వద్దులే” అన్నాడు. కానీ, పెద్దన్నయ్య వీరయ్య నన్ను వెళ్లడానికి అనుమతించాడు. 20 రూపాయలు ఇచ్చాడు. నాన్న ఏమీ అనలేక పోయాడు. ఆనందంతో మొదటిసారి రైలు ఎక్కి ఒంగోలు చేరాను. అక్కడి నుంచి రైలులోనే అమ్మనుబ్రోలు రైల్వేస్టేషన్‌లో దిగాను. తెలియని ప్రదేశం. దిక్కులు చూస్తూ ఉండగా “తమ్ముడూ” అన్న కేక వినిపించింది.

గడ్డం పెంచుకుని ఉన్న సత్యనారాయణ శాస్త్రిని కొంచెం సేపు గుర్తు పట్టలేక పోయాను. నా దగ్గరికి వచ్చి ఆప్యాయంగా పలకరించాడు. కల్మషం లేని వాత్సల్యాన్ని చూపించారు. నా చేతిలోని బ్యాగును తీసుకుని స్టేషన్ బయటికి నడిపించాడు. ఇద్దరం కలిసి సైకిల్‌మీద ప్రయాణించాం. వాళ్ల ఇంట్లో అందరూ మా కోసం ఎదురు చూస్తున్నారు. నేను ఒకవేళ ‘రానేమోనని’ వారి అనుమానం. శాస్త్రి అమ్మకు వంగి నమస్కరించి, ఆశీర్వాదం తీసుకున్నాను. శాస్త్రి అన్న కృష్ణమూర్తి జ్యోతిశ్శాస్త్రలతో దిట్ట. నన్ను చూడగానే  అబ్బాయి గొప్ప రచయిత అవుతాడు” అని దీవించాడు.

ఎలాంటి అరమరికలు లేకుండా శాస్త్రి వాళ్లింట్లో వారం రోజులు ఉన్నాను. రోజుకు మూడుసార్లు కాఫీ, రెండుసార్లు ఫలహారం, రెండుసార్లు అరటాకుల్లో భోజనం. అదీ ఆంధ్ర బ్రాహ్మణ భోజనం ఎలా ఉంటుందో రుచి చూశాను. జీవితంలో అలాంటి అవకాశం లభిస్తుందని ఏనాడు అనుకోలేదు. అక్కడున్న వార రోజుల్లో శాస్త్రి అమ్మనబ్రోలులోని సుప్రసిద్ధ చెన్నకేశవస్వామి దేవాల యం చూపించడమేకాదు, అక్కడ భక్తులందరి ముందూ నాచేత భాగవత పద్యాలు వినిపింపజేశారు.

అంతేకాదు, ఆయన పని చేస్తున్న హైస్కూలులో భాగవతం మీద నాచేత ప్రసంగం ఇప్పించారు. ఇదంతా శాస్త్రికి నామీద ఉన్న సోదర వాత్సల్యానికి ప్రత్యక్ష నిదర్శనం. నా మొదటి ప్రసంచం వారి ప్రోద్బలం వల్లనే సాధ్యమైంది.

ఒకరోజు అమ్మనబ్రోలు నుంచి నెల్లూరుకు వెళ్లాం. అక్కడ ఒక రోజంతా ఉన్నాం. వేదాద్రి నరసింహ స్వామిని దర్శించుకుని, నేరుగా పెన్నా నది దాటుతూ (అప్పట్లో నీళ్లు మొలలోతు మాత్రమే ఉన్నాయి) జన్నవాడ (జొన్నవాడ)కు వెళ్లాను. (యాభై ఏళ్ల క్రితం ఈ రోజులాగా పెన్నా నదిమీద వంతెన నిర్మాణం కాలేదు.) అక్కడొక రాత్రి ఉన్నాం. శాస్త్రి అక్కడి అమ్మవారి ముందు నాచేత ఆశువుగా ఎన్ని పద్యాలు చెప్పించాడో ఇప్పటికీ గుర్తు లేదు.

అలా, అక్కడి నుంచే నేను ఆశుకవిత్వం చెప్పడం మొదలుపెట్టాను. జొన్నవాడ నుంచి తిరుపతికి వెళ్లాం. ఆ రోజుల్లో స్వామి దర్శనం సులభంగానే అయ్యేది. ఒక రోజుండి రెండుసార్లు స్వామి దర్శనం చేసుకున్నాం. ఇక్కడ ఒక విషయం మరిచి పోయాను. వావిలాల సత్యనారాయణ శాస్త్రి మా ఇంట్లో పుట్టలేదు కాని, నాకు నా తోడబుట్టిన అన్నయ్యతో సమానం. నేనూ వారి ఇంట్లో పుట్టలేదు కాని తనకు సొంత తమ్ముడినే. ఈరోజుకీ మా ఆత్మీయ స్నేహబంధం చెక్కు చెదరలేదు. 

-ఆచార్య మసన చెన్నప్ప

 వ్యాసకర్త సెల్: 9885654381