calender_icon.png 21 September, 2024 | 8:22 AM

రియల్ అమ్మకాల్లో బెంగళూరు హవా

28-07-2024 02:30:00 AM

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 27 (విజయక్రాంతి): రియల్ ఎస్టేట్ అమ్మకాల్లో బెంగళూరు హవా చూపించింది. కిందటి వేసవిలో నీటి కష్టాలతో అల్లాడిన ఈ ఐటీ సిటీ ఏప్రిల్  జూన్ త్రైమాసికంలో 18,550 యూనిట్ల రియల్ ఎస్టేట్ అమ్మకాలతో సిటీ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు కేరాఫ్‌గా నిలిచింది. అలాగే నూతన లాంచ్‌లలోను 45 శాతం వృద్ధిని నమోదు చేసుకొని ఏకంగా 16,537 యూనిట్లకు చేరుకుందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ జేఎల్‌ఎల్ తాజా నివేదికలో వెల్లడించింది. ఐటీ రంగం అభివృద్ధి చెందడంతో పాటు మౌలిక వసతుల కల్పన, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీ ఫలితంగా బెంగళూరు సిటీలో రియల్ ఎస్టేట్ అమ్మకాల్లో నిర్ధిష్ట వృద్ధి కొనసాగుతుందని జేఎల్‌ఎల్ సంస్థ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ అరోరా తెలిపారు.

కొత్త లాంచ్‌లలో వైట్ ఫీల్డ్ ఏరియా 47 శాతం వృద్ధిలో ఉండగా, తర్వాత మైసూర్ రోడ్డు, బల్లారి రోడ్డు ఉన్నాయని ఆ నివేదికలో పేర్కొన్నారు. బెంగళూరు విమానాశ్రయానికి వైట్ ఫీల్డ్‌ను అనుసంధానించే కారిడార్ పూర్తి కావడంతో ఈ ప్రాంతంలో పలువురు డెవలపర్లు ఎక్కువ ప్రాజెక్టులను చేపడుతున్నారని తెలిపారు. అయితే ఈ ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టుల్లో తక్కువలో తక్కువ రూ.కోటి నుంచి రూ. ౩ కోట్ల వరకు ఉన్న ప్రాజెక్టులే ఉన్నాయని తెలిపారు. అలాగే బెంగళూరులో అద్దె విలువలు కూడా 4.45 శాతం ఆదాయంతో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని నివేదికలో పేర్కొన్నారు.