బెంగళూరు వరుసగా ఐదో విజయం
ఢిల్లీ క్యాపిటల్స్ ఆశలు ఆవిరి!
‘ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ’ అన్న చందంగా.. ఆశలే లేని స్థితిలో ఆర్సీబీ అదరగొడుతోంది. ప్రత్యర్థితో సంబంధం లేకుండా వరుస విజయాలతో దూసుకెళ్తున్న బెంగళూరు.. లీగ్‌లో వరుసగా ఐదో విజయం నమోదు చేసుకుంది. తొలి ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క దాంట్లోనే గెలిచిన బెంగళూరు.. తర్వాత వరుసగా పాంచ్ పటాకా మోగించింది.
మెరుపు ఆరంభం లభించిన తర్వాత విరాట్ కోహ్లీ వెనుదిరిగినా.. రజత్ పాటిదార్, జాక్స్ ధాటిగా ఆడటంతో మొదట బెంగళూరు మంచి స్కోరు చేయగలిగింది. ఆనక ఛేదనలో ఢిల్లీ ఆకట్టుకోలేకపోయింది. పంత్ గైర్హాజరీలో జట్టును నడిపించిన అక్షర్ పటేల్ చక్కటి అర్ధశతకంతో తుదికంటా పోరాడినా ఫలితం లేకపోయింది.
బెంగళూరు: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రాయల్ చాలెం జర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ 17వ సీజన్‌లో వరుసగా ఐదో విజయం నమోదు చేసుకుంది. ప్లే ఆఫ్స్ చేరడం దాదాపు అసాధ్యమైన సమయంలో.. బెంగళూరు అసాధారణ రీతిలో విజృంభించి ఢిల్లీ అవకాశాలపై నీళ్లు కుమ్మరించింది. ఆదివారం డబుల్ హెడర్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో బెంగళూరు 47 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుచేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. రజత్ పాటిదార్ (32 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. విల్ జాక్స్ (41; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కామెరూన్ గ్రీన్ (32 నాటౌట్; ఒక ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ (13 బంతుల్లో 27; ఒక ఫోర్, 3 సిక్సర్లు) ఉన్నంతసేపు దడదడలాడించాడు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రసిక్ సలామ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 19.1 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. తాత్కాళిక కెప్టెన్ అక్షర్ పటేల్ (39 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. చాలా రోజుల తర్వాత మైదానంలోకి దిగిన డేవిడ్ వార్నర్ (1), అభిషేక్ పొరెల్ (2), కుమార్ కుషాగ్ర (2) స్టబ్స్ (3) విఫలమయ్యారు. మెక్‌గుర్క్ (21; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), షై హోప్ (29) ఎక్కువసేపు నిలువలేకపోయారు. బెంగళూరు బౌలర్లలో యష్ దయాల్ 3, ఫెర్గూసన్ రెండు వికెట్లు పడగొట్టారు.
ఢిల్లీని అధిగమించి..
ఐపీఎల్ సీజన్‌లో ఎవరూ ఊహించని విధంగా జైత్రయాత్ర సాగిస్తున్న బెంగళూరు 13 మ్యాచ్‌ల్లో ఆరో విజయంతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే ప్లే ఆఫ్స్ అవాకశాలు మరింత మెరుగయ్యే దశలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సస్పెన్షన్ కారణంగా రిషబ్ పంత్ కీలక మ్యాచ్‌కు దూరం కావడంతో పాటు.. ఫీల్డింగ్ వైఫల్యాలు ఆ జట్టు అవకాశాలను దెబ్బతీశాయి. లీగ్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ 6 విజయాలతో పట్టికలో ఆరో స్థానానికి పరిమితమైంది.
సంక్షిప్త స్కోర్లు
బెంగళూరు: 20 ఓవర్లలో 187/9 (రజత్ పాటిదార్ 52, విల్ జాక్స్ 41; రసిక్ సలామ్ 2/23, ఖలీల్ అహ్మద్ 2/31),
ఢిల్లీ: 19.1 ఓవర్లలో 140 ఆలౌట్ (అక్షర్ పటేల్ 57, హోప్ 29; యష్ దయాల్ 3/20, ఫెర్గూసన్ 2/23).