calender_icon.png 10 January, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెంగాల్‌దే సంతోష్ ట్రోఫీ

01-01-2025 12:00:00 AM

ఫైనల్లో కేరళపై 1-0తోవిజయం

హైదరాబాద్: దేశవాలీ టోర్నీ 78వ సంతోష్ ట్రోఫీ విజేతగా పశ్చిమ బెంగాల్ నిలిచింది. మంగళవారం హైదరాబాద్‌లోని డెక్కన్ ఎరీనా వేదికగా జరిగిన ఫైనల్లో బెంగాల్ 1-0తో కేరళపై ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. బెంగాల్ తరఫున రాబి హన్స్‌డే (ఆట 90+4వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు.

అదనపు సమయంలోనూ గోల్స్ రాకపోవడంతో పెనాల్టీ షూటౌట్ తప్పదన్న సమయంలో రాబి పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి బంతిని గోల్ పోస్ట్‌లోకి తరలించాడు. కాగా బెంగాల్  సంతోష్ ట్రోఫీని రికార్డు స్థాయిలో 33వ సారి గెలుచుకోవడం విశేషం. ఏడుసార్లు చాంపియన్‌గా నిలిచిన కేరళ జట్టు 2017-18, 2021-22 సీజన్లలో బెంగాల్‌ను ఓడించి టైటిల్‌ను అందుకుంది.

తాజా విజయంతో బెంగాల్ కేరళపై ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. అంతకముందు ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీజీవో) అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆటగాళ్లతో కరచాలనం చేశారు. మ్యాచ్ ముగిసిన అనంతరం విజేతగా నిలిచిన బెంగాల్ జట్టకు టైటిల్‌ను అందించారు.