calender_icon.png 5 November, 2024 | 8:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెంగాల్ టీచర్స్ స్కామ్

24-04-2024 12:05:00 AM

లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ సర్కార్‌కు భారీ షాక్ తగిలింది.2016లో చేపట్టిన 25,753 మంది టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలను  రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు  సోమవారం సంచలన తీర్పు  వెలువరించింది. అలాగే ఉద్యోగాలు పొందిన వీరంతా ఇప్పటివరకు తీసుకున్న వేతనాలను వడ్డీతో సహా వెనక్కి ఇచ్చేయాలని స్పష్టం చేసింది. రికవరీ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. నియామక ప్రక్రియపై తదుపరి దర్యాప్తు కొనసాగించాలని, మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. కొత్తగా రిక్రూట్‌మెంట్ ప్రక్రియను చేపట్టాలని కూడా పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ)ని ఆదేశించింది. 2016లో రాష్ట్రప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం పరీక్ష నిర్వహించారు. 24,460 ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన ఈ పరీక్షకు  23 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు.

అయితే ఈ రిక్రూట్‌మెంట్‌లో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఉన్న ఖాళీలకంటే అధికంగా 27,753 మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చారని పిటిషనర్ల తరఫు న్యాయవాది  ఫిర్దౌస్ షమీమ్ పేర్కొన్నారు. తక్కువ మార్కులు వచ్చిన వారిని సైతం మెరిట్ జాబితాలో చోటు కల్పించారని, ఖాళీ ఓఎంఆర్ షీట్లు ఇచ్చిన వారికి కూడా అపాయింట్‌మెంట్లు  వచ్చాయని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు కలకత్తా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.అంతేకాదు ఎస్‌ఎస్‌సి ప్యానెల్ గడువు ముగిసిన తర్వాత 500 మందికి పైగా ఉద్యోగాల్లో నియమించారని, వారంతా ప్రభుత్వంనుంచి జీతాలు తీసుకుంటున్నారని కూడా వారు తమ పిటిషన్లలో పేర్కొన్నారు.

దీనిపై  సిబిఐ దర్యాప్తుకు జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ నేతృత్వంలోని కలకత్తా హైకోర్టు బెంచ్ ఆదేశించడంతో ఈ కుంభకోణం డొంక కదిలింది. టీచర్ల అర్హతా పరీక్ష (టెట్)కూడా పాస్ కాకుండానే అక్రమంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాల్లో పని చేస్తున్న 269 మంది టీచర్ల నియామకానికి సంబంధించి ప్రధానంగా సిబిఐ దర్యాపు దృష్టిపెట్టింది. నియామక ప్రక్రియ మొత్తం బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతంతో కూడుకుందని సీబీఐ తన నివేదికలో పేర్కొంది. దీంతో ఈ నియామక ప్రక్రియ జరిగినప్పుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా పని చేసినపార్థా గంగూలీని  సీబీఐ ముందు విచారణకోసం హాజరు కావలసిందిగా జస్టిస్ గంగోపాధ్యాయ్ ఆదేశించారు.

అంతకు ముందే ఈ వ్యవహారంలో ముడుపుల వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పశ్చిమ బెంగాల్ ఎస్‌ఎస్‌సీ మాజీ సలహాదారు శాంతిప్రసాద్ సిన్హా, ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా పని చేసిన ప్రసన్న రాయ్‌కి చెందిన రూ.230 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. 2022 జులైలో పార్థా చటర్జీ, ఆయన బంధువుల ఇళ్లలో  సోదాలు జరిపిన ఈడీ అనంతరం ఆయనను అరెస్టు చేసింది కూడా.

ఇదంతా గత చరిత్ర. హైకోర్టు తీర్పుపై ఈ పరీక్ష రాసి ఉద్యోగులు రాని వాళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ గత ఎనిమిదేళ్లుగా ఉద్యోగాలు చేస్తు న్న వారి పరిస్థితి ఏమిటి? అంత పెద్ద మొత్తాన్ని నాలుగు వారాల్లో ఎలా తిరిగి ఇవ్వగలమని వారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, ఎవరో కొంత మం ది చేసిన తప్పుకు ఇన్ని వేల మంది శిక్ష అనుభవించాలా ? ఆ పాతిక వేల మందిపై ఆధారపడిన లక్షలమంది పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాగా హైకోర్టు తీర్పు అన్యాయమని, చట్ట విరుద్ధమని, దీనిపై సుప్రీంకోర్టుకు వెళతామని అటు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఇటు ఎస్‌ఎస్‌సీ చెబుతున్నాయి.లోక్‌సభ ఎన్నికలకు ముందు వచ్చిన ఈ తీర్పు ప్రభావం ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  కాగా ఈ వ్యవహారంలో సీబీఐ విచారణకు ఆదేశించిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గం గోపాధ్యాయ్ ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో  పశ్చిమ బెంగాల్‌లోని టామ్లు క్ నియోజకవర్గంనుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.