మంత్రి దామోదర రాజనర్సింహ
బోరంచలో రెండు ఫీల్డ్ గ్రావిటీ పనులకు శంకుస్థాపన
నారాయణఖేడ్, అక్టోబర్ 28: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు బోరంచల ఎత్తిపోతల పథకాన్ని పట్టించుకోలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా మనూరు మండలంలోని బోరంచలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, స్థానిక ఎమ్మెల్యే పీ సంజీవరెడ్డితో కలిసి రెండు ఫీల్డ్ గ్రావిటీ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు.
మంత్రి మాట్లాడుతూ.. బోరంచ ఎత్తిపోతల పథకం ద్వారా మనూరు, రేగోడ్ మండలాల్లోని 2,900 ఎకరాల భూమి సాగులోకి వస్తుందని. దీంతో రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఖేడ్ ఆర్డీవో అశోక్‌చక్రవర్తి, డీఎస్పీ వెంకట్‌రెడ్డి, ఇరిగేషన్ ఈఈ విజయ్, డీఈ జలందర్, ఏఈ విద్యావతి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
కులగణన తప్పనిసరి
మెదక్: కులగణన ద్వారా ఏ కులం సంఖ్య ఎంత ఉందో తెలుస్తుందని, తద్వారా సామాజికంగా, ఆర్థికంగా వారి స్థితిగతులు తెలుస్తాయని, తప్పకుండా కులగణన చేయాల్సిందేనని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మెదక్ జిల్లా రేగోడు మండలం టి.లింగంపల్లిలో సోమవారం నిర్వహించిన బోరంచ ఎత్తిపోతల పథకం ఫీల్డ్ గ్రావిటీ మెయిన్స్ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
దళితులలో కూడా అసమానత ఉండకూడదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని, అందుకు అనుగుణంగానే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్షాలకు కూడా స్వేచ్ఛనిచ్చామని, బీఆర్‌ఎస్
పదేళ్లపాటు నియంత పాలన కొనసాగించిందన్నారు. జాబ్ క్యాలెండర్‌కు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బోరంచ ఎత్తిపోతల పథకాన్ని నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు. రూ.6 కోట్లతో మర్పల్లి బ్రిడ్జి మంజూరవుతుందని, రూ.105 కోట్లతో సింగూరు కాల్వలకు మరమ్మతు చేయబోతున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లలో రాజకీయం చేయొద్దని మంత్రి సూచించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. అభివృద్ధిలో అందరూ కలసిరావాలనికోరారు.