* సినిమాలతో యువత చెడుమార్గం
* సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి
* కిమ్స్‌లో శ్రీతేజ్‌కు పరామర్శ
* ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 25 లక్షల సాయం అందజేత
* నిలకడగా శ్రీతేజ్ ఆరోగ్యం: కిమ్స్
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 21 (విజయక్రాంతి): సినిమాలతో యువత చెడిపోతుం దని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ నెల 4న సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను శనివారం పరామర్శించారు. శ్రీతేజ్ చెయ్యి పట్టుకొని పిలిచి భావోద్వేగానికి లోనయ్యారు. అసెంబ్లీలో ప్రకటించిన విధంగా శ్రీతేజ్ వైద్యసహాయం కోసం ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రూ.25 లక్షల చెక్కును బాలుడి తండ్రికి అందించారు.
శ్రీతేజ్ అవయవాల పనితీరు గురించి డాక్లర్లను అడిగి తెలుసుకున్నారు. అవసరం అనుకుంటే అమెరికా నుంచైనా మంచి మందులు తెప్పించండి, డాక్లర్లను పిలిపించండి అని వైద్యులకు కోరారు. శ్రీతేజ్ చికిత్సకయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తోందని, రూపాయి కూడా భాస్కర్‌ను అడగొద్దని వైద్యులకు సూచించారు.
సందేశాత్మక చిత్రాలకే ప్రోత్సాహకం
రాష్ట్రంలో బెన్‌ఫిట్ షోలను బ్యాన్ చేస్తున్నట్టు కోమటిరెడ్డి ప్రకటించారు. తెలంగాణ చరిత్రకి సంబంధించినవి, సందేశాత్మక సినిమాలకు మాత్రమే ప్రోత్సాహకాల గురించి ఆలోచిస్తామని స్పష్టంచేశారు. టికెట్ల రేట్ల పెంపుపై కూడా పునరాలోచిస్తామని తెలిపారు. పుష్ప తాను కూడా చూశానని, ఇకపై చారిత్రక, తెలంగాణ సినిమాలను తప్పా తెలుగు సినిమాలు చూడనని పేర్కొన్నారు. మూడు గంటల సినిమా సమయంలో చాలా పనులు చేసుకోవచ్చని చెప్పారు. సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనపై తాము కూడా క్షమాపణ చెప్తున్నామని అన్నారు.
సినిమా హీరోలు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, పోలీసులు అనుమతులు ఇవ్వకపోతే బయటకి వెళ్లొద్దని కోరారు. సినిమా ప్రమోషన్ చేయడానికి వచ్చి ఓపెన్ టాప్ కార్లలో తిరగవద్దని, ఇంకోసారి ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా జాగ్రత్తగా మెలగాలని హితవుపలికారు. సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తామని, పరిశ్రమను గౌరవిస్తామని ఉద్ఘాటించారు. దురుసు చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించమని స్పష్టంచేశారు. అందరూ హీరోలు, ప్రొడ్యూసర్స్ సహకరించాలని మంత్రి కోరారు.
ఏ సమస్య వచ్చిన నేనుంటా..
శ్రీతేజ్ కుటుంబానికి అండగా ఉంటానని అతడి తండ్రి భాస్కర్‌కు మంత్రి భరోసా ఇచ్చారు. బాలుడి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఏడాది క్రితమే రేవతి భర్తకు కాలేయాన్ని ఇచ్చి ప్రాణదానం చేసి, తనువు చాలించడం బాధకరమన్నారు. ప్రస్తుతం భాస్కర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న మంత్రి.. కాలేయ మార్పిడి ఖర్చులను సీఎంఆర్‌ఎఫ్ కింద ఇప్పించేలా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ‘తండ్రిగా ఇద్దరు పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత నీమీద ఉంది.. ఆరోగ్యం జాగ్రత్త’ అంటూ భాస్కర్‌కు మంత్రి ధైర్యం చెప్పారు.
ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని కిమ్స్ వైద్యులు తెలిపారు. ఈ మేరకు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ విడుదల చేశారు. వెంటిలేటర్ సాయం లేకుండానే శ్రీతేజ్ శ్వాస తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. బాలుడికి అప్పుడప్పుడు జ్వరం వస్తోందని, శుక్రవారంతో పోల్చితే శనివారం శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడినట్లు కిమ్స్ వైద్యులు బులెటిన్‌లో వెల్లడించారు.