‘పుష్ప’ తెచ్చిన ఫైర్
- సంక్రాంతి సినిమాల పరిస్థితేంటన్న సందేహంలో మేకర్స్
- ప్రభుత్వ నిర్ణయం సరైనదే అంటున్న తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్
- సీఎం రేవంత్‌రెడ్డిని కలిసే యోచనలో ఫిల్మ్ మేకర్స్
* తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు పరిశ్రమలో అందరినీ టెన్షన్‌కు గురిచేస్తున్నాయి. మోహన్‌బాబు ఇంటి గొడవ రచ్చకెక్కి, మీడియా వ్యక్తులను గాయపర్చడం ఫిల్మ్ ఇండస్ట్రీకి చిన్నతనమైంది.
మరోవైపు ఇండస్ట్రీ ప్రముఖులకు ‘పుష్ప’ తెచ్చిన తంటాలు ఇన్నీ అన్నీ కావు! బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న ఘటనతో ఏర్పడిన ప్రస్తుత పరిస్థితులు చక్కబడేది ఎప్పుడు? అంతిమంగా ఇండస్ట్రీకి ‘బెనిఫిట్’ అవుతుందా? అన్న చర్చ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
* టికెట్ ధరల పెంపుతో ప్రేక్షకుల్లో కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతున్నది.
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్
సినిమా ప్రతినిధి, డిసెంబర్ 23 (విజయక్రాంతి): జనమంతా ఇయర్ ఎండింగ్ సంబురాల మూడ్‌లో ఉన్నా రు. మరోవైపు మెల్లగా సంక్రాంతి పండుగ సందడి ప్రారంభమవుతోంది. సంక్రాంతి అనగానే ముఖ్యంగా సినీ ప్రియులకు గుర్తుకొచ్చేది ఆ పండగ సెలవుల్లో విడుదలయ్యే సినిమాలే. అందుకే నిన్నా మొన్నటి దాకా సెలవులు, సినిమాల వరకే ముచ్చట్లు సాగాయి. ఇప్పు డు ఆ చర్చలు మరింత ఆసక్తికరంగా సాగుతున్నాయి.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ చర్చలు హాట్ హాట్‌గా మార డానికి కారణాలు ముఖ్యంగా రెండు అంశాలున్నాయి. అందులో ఒక టి నటుడు మోహన్‌బాబు ఇంటి గొడవ రచ్చకెక్కడం. రెండోది అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ‘పుష్ప2’ చిత్రం బెనిఫిట్ షో సందర్భంగా దుర్ఘటన చోటుచేసుకోవడం.
మోహన్‌బాబు ఫ్యామిలీ గొడవ మీడియాకెక్కడం, ఆ గొడవల్లో మీడియాకు నష్టం వాటిల్లిన దరిమిలా ఇండస్ట్రీ తీవ్ర విమర్శల పాలైంది. చిత్రపరిశ్రమలో తన ప్రయాణానికి ఈ ఏడాదితో 50 ఏళ్లు నిండాయంటూ మోహన్‌బాబు.. ఆ జర్నీలోని తీపి జ్ఞాపకాలను అందరితో పంచు కుంటున్నారు.
70 ఏళ్లు పైబడిన ఆయన ఎంతో ఓపికగా రచ్చకెక్కిన తన ఇంటి గొడవలకు పరిష్కార మార్గం వెతుక్కోలేకపోయారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. సీనియర్ నటుడిగా తనకున్న గుర్తింపును, గౌరవాన్ని ఒక మీడియా పర్సన్‌పై దాడితో పోగొట్టుకున్నారనే అపవాదు మూటగట్టుకున్నారు.
అల్లు అర్జున్ వ్యవహారం..
‘పుష్ప2’ వివాదం టాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసింది. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన విషయంలో నటుడు అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు చిత్రసీమ విలువను, ఆ రంగ ప్రముఖులపై గౌరవాన్ని తగ్గించేలా ఉందన్న అభిప్రాయం అన్నివర్గాల్లో వ్యక్తమవుతోంది.
సీఎం రేవంత్‌రెడ్డి శనివారం అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత గంటల వ్యవధిలోనే అల్లు అర్జున్ ఇంటి కి మీడియాను పిలిచి, తన వ్యక్తిత్వ హననం చేశారంటూ పరోక్షంగా సీఎంను ఉద్దేశించి మాట్లాడటాన్ని సినీ నిర్మాతలే జీర్ణించుకోలేకపోతున్నారు. అలా మాట్లాడకుండా ఉండాల్సిందని అంటున్నారు. ప్రభుత్వం సహకరిస్తేనే ఇండస్ట్రీ మనుగడ సాగిస్తుందన్న భావనను వ్యక్తం చేస్తున్నారు.
బన్నీ ప్రెస్‌మీట్ పెట్టడం ద్వారా ప్రభుత్వానికి, సినీ పరి శ్రమకు అంతరం పెరిగిందనే అభిప్రాయాన్ని బాహాటంగానే చెప్తున్నారు. ఆయన వ్యవహరించిన తీరే.. ఓయూ జేఏసీ విద్యార్థులు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారని అనుకుంటున్నారు. అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టి ఉండ కపోతే జనంలో వ్యతిరేకత వచ్చేది కాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
సంక్రాంతి సినిమాలకు ‘బెనిఫిట్’ అయ్యేనా?
సంధ్య థియేటర్ ఘటన పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో బెన్‌ఫిట్ షోలను రద్దు చేస్తున్నట్టు, టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి లేదంటూ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. ఆ మరుక్షణమే ఇండస్ట్రీలో టెన్షన్ మొదలైంది. ఎందు కంటే సంక్రాంతి అంటే అసలైన పండుగ సినీ పరిశ్రమకే! ఈసారి పండక్కి మూడు పెద్ద హీరోల సినిమాలు విడుదలకు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంతో నిండా నష్టపోతామన్న ఆందోళన ని ర్మాతలు, దర్శకుల్లో కనిపిస్తోంది. టికెట్ల ధరల పెంపునకు అనుమతి లేకుంటే బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేర ఫలితాలు ఉండవేమోనన్న భయం వాళ్లకు పట్టుకుంది. ఈ సంక్రాంతికి రామ్‌చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘గేమ్ చేంజర్’, బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘డాకు మహరాజ్’, వెంకటేశ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సిని మాలు రిలీజ్ అవుతున్నాయి.
ఈ అన్నింటిలోకెల్లా ‘గేమ్ చేంజర్’ చిత్రం భారీ బడ్జెట్‌తో తెర కెక్కింది. అంతేకాక ‘గేమ్ చేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలకు.. ఇటీవలే తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, సి నిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన ప్రకటన ప్రకారం బెన్‌ఫిట్ షోలు, టికెట్ల ధర పెంపు ఉండదు.
అదే జరిగితే ఇబ్బందు లు తప్పవనే భావన సినీ నిర్మాతల్లో నెలకొని ఉంది. అయితే ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతగా ఉన్న దిల్ రాజు ఇటీవలే టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం కలిసి వచ్చే అంశమేనని అంతా అనుకుంటున్నారు. సంక్రాంతికి విడుదలవుతున్న మూడు సినిమాల్లో ఆయనవే రెండు ఉన్నాయని, ప్రస్తుత పరిస్థితులు చక్కబడతాయని అందరూ భావిస్తున్నారు.
ఇండస్ట్రీకి వ్యతిరేకంగా తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్
ఇకపై తాను సీఎంగా ఉన్నంతవరకూ బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వనని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయంతో టాలీవుడ్ పెద్దలు తలలు పట్టుకున్నారు. పెద్ద హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాల పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నారు. మరోవైపు టాలీవుడ్ పెద్దల ఆలోచనలకు వ్యతిరేకంగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సభ్యులు తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికర చర్చకు దారి తీశాయి.
సీఎం రేవంత్ కామెంట్స్ నేపథ్యంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సోమవారం ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సమావేశంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ చైర్మన్ విజేందర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్స్ సెక్టార్ చైర్మన్ టీఎస్ రామ్‌ప్రసాద్, తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సెక్రటరీ బాలగోవింద్‌రాజ్, ఒంగోలు ఎగ్జిబిటర్ గోరంట్ల వీరినాయుడు, తెలంగాణ ఫిల్మ్ చాంబర్, ఈసీ మెంబర్, డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ చైర్మన్ విజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ‘సినిమా టికెట్ ధరలను పెంచటం వల్ల ప్రేక్షకుల్లో కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతున్నది. సాధారణ సినిమాలకు కూడా పెరిగిన టికెట్ ధరలనే వసూలు చేస్తున్నారని వారు భావిస్తున్నట్లు మాకు తెలిసింది. ఒక్కో సినిమాకు ఒక్కో రేటు పెట్టటం వల్ల ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు.
తొలి మూడు నాలుగు రోజుల్లో మధ్య తరగతివాళ్లు, స్టూడెంట్స్, చిన్న చిన్న పనులు చేసుకునే అభిమానులు సినిమాలను ఎక్కువగా చూస్తుంటారు. అలాంటి వాళ్ల దగ్గర నుంచి ఎక్కువ టికెట్ రేట్స్‌ను వసూలు చేయటం అనేది బాధాకరం. ఇటీవల మేం టికెట్ రేట్స్‌ను ఏదైనా ఒక రేటుకు ఫిక్స్ చేయాలని దిల్‌రాజును కూడా కలిశాం. అదే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల పేర్కొన్నారు.
ఆయన నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. సినిమాటోగ్రఫీ మినిష్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పారు. ఆయన కూడా మేం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. టికెట్ రేట్స్‌ను పెంచుతూ వచ్చే జీవోలను ప్రేక్షకులు సరిగ్గా గమనించరు. అదే రేట్స్ కంటిన్యూ అవుతున్నాయని భావిస్తుంటారు. ఆ ప్రభావం సినిమా కలెక్షన్స్‌పై పడు తున్నాయి.
తెలుగు ఫిల్మ్ చాంబర్‌లో రీసెంట్‌గా జరిగిన మీటింగ్‌లోనూ టికెట్ రేట్స్ పెంచటం వల్లనే ఆడియెన్స్ ఇబ్బంది పడుతున్నారని అనుకున్నారు. ఇప్పుడు టికెట్ రేట్స్ పెంచబోమంటూ సీఎం తీసుకున్న నిర్ణయంతో థియేటర్స్‌కు ప్రాణం పోసినట్టయ్యిం ది. టికెట్ రేట్స్ పెరగకుండా ఫిక్స్‌డ్‌గా ఉంటే ఎక్కువ మంది ప్రేక్షకులు సినిమాను చూసి ఆదరిస్తారు.
ఈ సందర్భంలో సీఎంకు, సినిమాటోగ్రఫీ మినిష్టర్‌కు ధన్యవాదాలు తెలియ జేస్తున్నాం’ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్స్ సెక్టార్ చైర్మన్ టీఎస్ రామ్‌ప్రసాద్ మాట్లాడుతూ ‘రాబోయే రోజుల్లో టికెట్ రేట్స్ పెంచ బోమంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రకటన వల్ల సినీ ఇండస్ట్రీకి, ప్రేక్షకులకు మంచి జరుగుతుందని భావిస్తున్నాం.
బెనిఫిట్ షోస్, టికెట్ రేట్స్ పెంచటం వద్దని చెబుతున్నాం. కొందరు నిర్మాతలు సినిమాపై ఎక్కువ ఖర్చు పెట్టామని చెప్పి రేట్స్ పెంచటం జరుగుతుం ది. దీనివల్ల థియేటర్స్‌కు వచ్చే జనాలు కూడా తగ్గుతున్నారు. కలెక్షన్స్‌పై ప్రభావం చూపుతోంది. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకు న్నట్లే ఏపీలోనూ బెనిఫిట్ షోస్ లేకుండా, టికెట్ రేట్స్ ఎక్కువగా పెరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళదామని అనుకుంటున్నాం.
టికెట్ రేట్స్ పెంచటం వల్ల సినిమాకు వచ్చే ప్రేక్షకుడిపైనే ఆ భారం పడుతుంది. అలాంటి చర్యలు థియేటర్స్‌కు నష్టాన్ని కలిగిస్తాయే తప్ప.. లాభాన్ని కలిగించవు. ఇలాంటి చర్యలు వల్ల మీడియం బడ్జెట్ సినిమాలు కలెక్షన్స్ లేక దెబ్బ తింటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని ఏపీలోనూ అమలు చేయాలని రిక్వెస్ట్ చేస్తాం’ అన్నారు.
తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సెక్రటరీ బాలగోవింద్ రాజ్ మాట్లాడుతూ ‘మూడు నాలుగేళ్ల నుంచి టికెట్ రేట్స్ పెంచటం వల్ల కలిగే కన్‌ఫ్యూజన్‌ను మనం గమనిస్తూనే ఉన్నాం. ఇప్పుడు అది పీక్స్‌కి చేరుకుంది. దానివల్ల ఎంతో మంది థియేటర్స్‌కు రాలేదని మేం భావిస్తున్నాం. టికెట్ రేట్స్ ఎంత ఉన్నాయనే వివరాలు సరిగ్గా తెలియక ఆడియెన్స్ సతమతమైన రోజులున్నాయని కూడా థియేటర్స్ యజమానులం మాట్లాడుకున్న సందర్భాలున్నాయి.
దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని రెండు చాంబర్స్ వాళ్లం అనుకుంటున్నాం. టికెట్ రేట్స్‌ను ఫిక్స్‌డ్‌గా ఉండేలా చూడాలని ఇప్పుడు తెలంగాణలో నిర్ణయం తీసుకోవటం మంచి పరిణామంగా భావిస్తున్నాం. సినిమాను ఎక్కువ థియేటర్స్‌లో విడుదల చేయటం ఎలా అనే దానిపై నిర్మాతలు ఆలోచించి నిర్ణయించుకోవాలి. దీనివల్ల నిర్మాతలకు కూడా మేలు కలుగుతుందని భావిస్తున్నాం’ అన్నారు.
దిల్ రాజుతో మాట్లాడి సీఎంను కలుస్తాం: నిర్మాత నాగవంశీ
సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో తెలుగు సినీ ప్రముఖులు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసే ఆలోచనలో ఉన్నారని నిర్మాత నాగవంశీ తెలిపారు. ‘గేమ్ చేంజర్’ సినిమా ప్రచారంలో భాగంగా అమెరికాలో ఉన్న నిర్మాత, టీజీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత సీఎంను కలుస్తామని చెప్పారు. టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలపై చర్చిస్తామని నాగవంశీ తెలిపారు.
‘డాకు మహరాజ్’ చిత్ర విశేషాలు తెలియజేసేందుకు సోమవారం మీడియా ముందుకొచ్చిన నిర్మాత నాగవంశీ.. ఈ సందర్భంగా తనకు ఎదురైన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ‘సంధ్య థియేటర్ ఘటన తర్వాత మీ మూవీ విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అని అడగ్గా.. ‘ఆ నిమిషంలో జరిగే దాన్ని ఎవరూ ఆపలేరు. ఈసారి నుంచి ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటాం.
ఒక సినిమా ఎన్నో థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ప్రతిచోటా మేం ఫాలోఅప్ చేయలేం కదా! ఒకవేళ అలా ఫాలోఅప్ చేస్తామని చెప్పినా అది నమ్మశక్యంగా ఉంటుందా? మా పరిధిలో ఉన్నంతవరకూ తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాం. ఇటీవల జరిగిన ఘటనలు మరోసారి జరగకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తాం’ అని సమాధానమిచ్చారు.
ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్‌కు షిఫ్ట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది కదా? దానిపై మీ సమాధానం ఏంటి? అని అడగ్గా, ‘నేను చాలా డబ్బులు పెట్టి హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకున్నా. ఏపీకి ఎందుకు వెళ్తాను. ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం నుంచి ఎప్పుడూ సపోర్ట్ ఉంటుందని పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచీ చెప్తూనే ఉన్నారు. అప్పట్నుంచి రిలీజ్ అయిన సినిమాలకు కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు’ అని చెప్పారు.