calender_icon.png 9 January, 2025 | 11:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ బందోబస్తు మధ్య డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియ

08-01-2025 06:16:51 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలో నిర్మాణం పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పోలీస్ బందోబస్తు మధ్య సాగింది. బుధవారం పట్టణంలోని సిఈఆర్ క్లబ్లో లాటరీ పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక చేపట్టారు. లబ్ధిదారుల జాబితాను మున్సిపల్ కార్యాలయం ఆవరణలో నోటీస్ బోర్డుపై ప్రదర్శించిన అధికారులు అందులో ఎంపికైన వారిలో లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లు కేటాయిస్తామని అధికారులు ప్రకటించారు. ఎంపికైన లబ్ధిదారుల జాబితా తప్పుల తడకగా ఉందని దీనిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పలు కుల సంఘాలు, ఆదివాసి సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అధికారులకు వినతి పత్రం అందించి ఆందోళనకు సిద్ధం అయ్యారు.

ముందుగా ప్రకటించిన విధంగా లబ్ధిదారుల ఎంపిక కోసం లాటరీ పద్ధతికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు అదికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా లబ్ధిదారుల ఎంపికలో లాటరీ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు నిర్బంధ చర్యలు చేపట్టడంతో ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాలు, ఆదివాసి సంఘాల నాయకులు ప్రభుత్వ  తీరుపై మండిపడుతూ లాటరీ నిర్వహించే సిఈఆర్ క్లబ్ వైపు కన్నెత్తి చూడలేకపోయారు. ఇదిలా ఉండగా లాటరీని అడ్డుకునేందుకు రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాలు, ఆదివాసి సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రాకపోవడంతో అధికారులు యదేచ్చగా లాటరీ ప్రక్రియ చేపట్టారు. ఏదేమైనప్పటికీ పోలీస్ బందోబస్తు మధ్య అధికారుల సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక నిర్వహించడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.